ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

AP Floods: వేగంగా సాయం..

వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో ముమ్మరంగా సహాయ చర్యలు

క్షేత్రస్థాయిలో నిమగ్నమైన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు

బాధితులకు ఇప్పటికే ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీ పూర్తి

 కడపలో విద్యుత్తు లైన్ల పునరుద్ధ్దరణకు శ్రమిస్తున్న సిబ్బంది

రోడ్ల నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్న అధికారులు

పెన్నాలో వరద తగ్గుముఖం

పడుగుపాడు–నెల్లూరు రైల్వే ట్రాక్‌ పనులు పూర్తి

భారీ వర్షాలు, వరద ప్రభావిత జిల్లాల్లో తక్షణమే సహాయ చర్యలు చేపట్టి అధికార యంత్రాంగం అంతా క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షిస్తుండటంతో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. వైఎస్సార్, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో మంత్రులు, స్థానిక ప్రజా ప్రతినిధులు స్వయంగా బాధిత ప్రాంతాలకు చేరుకుని సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం, నిత్యావసరాల పంపిణీని ఇప్పటికే పూర్తి చేశారు.

రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న విద్యుత్తు లైన్లకు మరమ్మతులు కూడా దాదాపుగా పూర్తయ్యాయి. చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్‌లో వరదల వల్ల దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌ను 40 గంటల వ్యవధిలోనే పునరుద్ధరించడంతో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి.

వడివడిగా సహాయ చర్యలు
వైఎస్సార్‌ కడప జిల్లాలో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో పునరావాసం, సహాయ చర్యలు అత్యంత వేగంగా సాగుతున్నాయి. ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె, పులపత్తూరు, గుండ్లూరు తదితర పది ముంపు గ్రామాల్లో ప్రత్యేక అధికారులను నియమించి 40 రోజులపాటు ఇవే బాధ్యతలు అప్పగించారు. అన్ని గ్రామాలలో ఒకేసారి పునరావాస పనులను పూర్తి చేసేలా చర్యలు చేపట్టారు.

విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన సాగుతున్నాయి. ఇప్పటికే ఎగువ మందపల్లె, దిగువ మందపల్లె గ్రామాల్లో పనులు పూర్తి కాగా మరో నాలుగు రోజుల్లో మిగిలిన చోట్ల కూడా పూర్తి కానున్నాయి. వరదల్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయిన విద్యార్థుల వివరాలను గ్రామాల వారీగా నమోదు చేస్తున్నారు. 

మరింత కుంగిన వంతెన…
జమ్మలమడుగు, ముద్దనూరు మధ్య పెన్నా వరద బీభత్సానికి కుంగిన హైలెవల్‌ బ్రిడ్జి మరింత కిందకు కుంగిపోవడంతో రాకపోకలను నిలిపివేసి ప్రజలను అప్రమత్తం చేశారు. పెన్నా నదిలో వరదనీటి ప్రవాహం కొంత తగ్గింది. రెండు రోజుల క్రితం మైలవరం జలాశయం నుంచి పెన్నాలోకి 70 వేల నుంచి 45 వేల క్యూసెక్కుల నీరు వదలగా తాజాగా పది వేల క్యూసెక్కులకే పరిమితం చేశారు. హైలెవెల్‌ బ్రిడ్జికి మరమ్మతులు జరిగే వరకూ పురాతన లోలెవల్‌ బ్రిడ్జికి మరమ్మతులు చేసి రాకపోకలను కొనసాగించాలని ప్రజలు కోరుతున్నారు.

వైఎస్సార్‌ కడప జిల్లాలో ఇన్‌ఛార్జి మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జెడ్పీ చైర్మన్‌ ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, అధికారులు ముంపు గ్రామాల్లో పర్యటించారు. నీట మునిగిన వరి, చీనీ, అరటి పంటలను, అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని మంత్రి పరిశీలించారు. ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య మందపల్లె, పులపుత్తూరు గ్రామాల్లో పర్యటించి బాధితులకు బకెట్లు, జగ్గులు, చీరెలు, దుప్పట్లు, టవళ్లు, బియ్యం పంపిణీ చేశారు. 

చిత్తూరు జిల్లాలో ఆచూకీ లేని ఐదుగురు..
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో స్వర్ణముఖి పరీవాహక ప్రాంతాల్లో సహాయ చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. 132 శిబిరాల ద్వారా 32,310 మందికి పునరావాసం కల్పించి నిత్యావసరాలు, తక్షణ ఆర్థిక సాయం, వసతి, భోజన సౌకర్యాలను కల్పించారు. చిత్తూరు జిల్లావ్యాప్తంగా 66 మండలాల్లో 489 గ్రామాలు వరద ముంపునకు గురైనట్లు గుర్తించారు. 126 గ్రామాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. 62,865 మంది బాధితులు వరదల వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు.

జిల్లాలో 11 మంది వరదల్లో కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఐదుగురి ఆచూకీ తెలియరాలేదని అధికారులు తెలిపారు. రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువు లీకేజ్‌ పనులను చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, కలెక్టర్‌ హరినారాయణన్, ఇరిగేషన్‌ అధికారులు పర్యవేక్షిస్తూ మరమ్మతులు వేగంగా పూర్తయ్యేలా చర్యలు చేపట్టారు. చిత్తూరులోని కైలాసపురం వద్ద ముంపునకు గురైన వరద బాధితులను డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఆర్టీసీ వైస్‌ చైర్మన్‌ విజయానందరెడ్డి, రాష్ట్ర మొదలియార్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ బుల్లెట్‌ సురేష్‌ పరామర్శించి నిత్యావసర వస్తువులు, దుస్తులను పంపిణీ చేశారు. 

48,900 కుటుంబాలకు తక్షణ సాయం, నిత్యావసరాలు..
జనజీవనం కకావికలమైన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెన్నా పరీవాహక ప్రాంతాల్లో ప్రజాప్రతినిధులతోపాటు  స్వచ్ఛంద సంస్థలు సహాయ కార్యక్రమాల్లో పాలు పంచుకుంటున్నాయి.  నష్టపోయిన 48,900 కుటుంబాలకు రూ.2 వేల తక్షణ ఆర్థిక సాయంతోపాటు నిత్యావసర సరుకులు, బియ్యం పంపిణీ అందించారు. 92 వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. జిల్లావ్యాప్తంగా 212 ఇళ్లు పూర్తిస్థాయిలో దెబ్బతినడంతో ఆర్థిక సాయం పంపిణీకి సిద్ధం చేశారు. నష్టంపై శాఖలవారీగా ప్రాథమిక అంచనాలతో నివేదిక రూపొందించారు.

జిల్లా ఇన్‌చార్జి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మంత్రులు మేకపాటి గౌతమ్‌రెడ్డి, డాక్టర్‌ పి.అనిల్‌కుమార్‌ యాదవ్‌తోపాటు ఎమ్మెల్యేలు నలపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్‌రావు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ సహాయ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. ఆత్మకూరు నియోజకవర్గం అప్పారావుపాళెం పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న బాధితులను పరామర్శించిన అనంతరం మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గిరిజన గూడేనికి చేరుకుని దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. 

40 గంటల్లో పడుగుపాడు–నెల్లూరు ట్రాక్‌ పనులు పూర్తి
చెన్నై–విజయవాడ ప్రధాన లైన్‌లోని పడుగుపాడు–నెల్లూరు సెక్షన్‌లో వరదల కారణంగా దెబ్బతిన్న రైల్వే ట్రాక్‌లను విజయవాడ డీఆర్‌ఎమ్‌ షివేద్రమోహన్‌ పర్యవేక్షణలో అధికారులు, సిబ్బంది అవిశ్రాంత కృషితో కేవలం 40 గంటల వ్యవధిలోనే అప్‌లైన్, డౌన్‌లైన్‌లలో పునరుద్ధరించారు. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలు సాధారణ స్థితికి చేరుకున్నాయి. వరద నీటి ఉధృతితో 1.8 కిలోమీటర్ల మేర ట్రాక్‌లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి.

దీంతో ఆ మార్గంలో అన్ని రైళ్లను రద్దు చేయడంతోపాటు కొన్నిటిని దారి మళ్లించి నడిపారు. ఆదివారం ఉదయం 6.30 గంటలకు యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరణ పనులు చేపట్టారు. రోడ్డు మార్గం దెబ్బతినడంతో కార్మికులను తరలించేందుకు 6 వర్కుమెన్‌ స్పెషల్‌ రైళ్లు, 12 జేసీబీలు, 4 ఎక్స్‌కవేటర్లు, 2 రైల్‌ లారీలను వినియోగించారు. 300 మంది కార్మికులు రాత్రి, పగలు అవిశ్రాంతంగా శ్రమించి పునరుద్ధరణ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. 

ఊరట చెందుతున్నాం..
గంటల వ్యవధిలో వరద ప్రవాహం ఇంట్లో చేరడంతో అంతా నీటి పాలైంది. వలంటీర్ల ద్వారా ప్రభుత్వం రూ.2 వేలు అందచేసింది. 25 కేజీలు బియ్యం, పప్పు, నూనె, ఇతర సరుకులు కూడా ఇచ్చారు. రెండు మూడు రోజుల్లో మరో రూ.3,800 నగదు ఇస్తామని హామీ ఇవ్వడంతో ఊరటగా ఉంది. 
– శీరం రమణమ్మ పడుగుపాడు, కోవూరు మండలం (నెల్లూరు జిల్లా)

ప్రభుత్వ సాయం బాగుంది
వరద గ్రామాల్లో అధికారులు చేపట్టిన సహాయ కార్యక్రమాలు బాగున్నాయి. డోజర్లు, జేసీబీలతో రోడ్లపై బురదను తొలగిస్తున్నారు. విరిగిపోయిన విద్యుత్‌ స్తంభాల స్థానంలో కొత్తవి అమర్చుతున్నారు. ప్రతి ఇంటికి రూ.5,800 ఆర్థిక సాయం అందించారు. నిత్యావసర సరుకులు కూడా ఇచ్చారు.
– శ్రీనివాసులు, మందపల్లె (కడప జిల్లా)

ఇంటింటికీ మందులు, నిత్యావసరాలు
వరదల వల్ల గ్రామాల్లోకి పెద్ద ఎత్తున బురద కొట్టుకుని వచ్చింది. ఫైరింజన్ల ద్వారా అధికారులు బురదను తొలగించారు. ప్రతి పూట భోజనాలు, మంచినీరు అందిస్తున్నారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఇంటింటికి మందులు ఇచ్చారు. రేషన్, నగదు, నూనె లాంటివి అందించి ఆదుకున్నారు.
– లక్ష్మిదేవి, మందపల్లె (కడప జిల్లా)