ఆంధ్రప్రదేశ్

ఎల్ఐసీలోని రూ. 2,200 కోట్లు స్వాహా చేశారు: చంద్రబాబు

డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులను పక్కదారి పట్టించారు

తాను వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్తే అధికారుల దృష్టి తనమీదే ఉంటుందని… దీనివల్ల సహాయక కార్యక్రమాలను అటంకం కలుగుతుందన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన చేతకానితనానికి నిదర్శనమని విమర్శించారు. వరద నివారణ కార్యక్రమాల్లో వైస్సార్సీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని అన్నారు. విఫలమైన అధికారులపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

వరద బాధితులకు ఇంత వరకు నష్టపరిహారం అందలేదని… డిజాస్టర్ మేనేజ్ మెంట్ నిధులు రూ. 1,100 కోట్లను ప్రభుత్వం దారి మళ్లించిందని చంద్రబాబు చెప్పారు. వన్ టైమ్ సెటిల్ మెంట్ పేరుతో జనాల నుంచి రూ. 14,261 కోట్లను వసూలు చేయాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కట్టించిన ఇళ్లకు కూడా ఎవరూ రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగానే రిజిస్ట్రేషన్లు చేయిస్తామని అన్నారు.

డ్వాక్రా మహిళలు ఎల్ఐసీలో పొదుపు చేసుకున్న రూ. 2,200 కోట్లను స్వాహా చేశారని చంద్రబాబు మండిపడ్డారు. చట్ట వ్యతిరేకంగా నిధులను తీసుకునే ప్రక్రియను తక్షణమే ఉపసంహరించుకోవాలని చెప్పారు. జగన్ విధ్వంసక పాలన, విపరీతంగా చేస్తున్న అప్పులతో ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటోందని అన్నారు.