డాలర్ శేషాద్రి అంతిమ సంస్కారాలు ఇవాళ తిరుపతిలో జరగనున్నాయి. ఆయన పార్థివదేహం విశాఖ నుంచి తిరుపతికి చేరుకుంది. సిరిగిరి అపార్ట్‌మెంట్‌లో భక్తుల సందర్శనార్థం ఉంచుతారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి 3 గంటల వరకు పూజలు నిర్వహించి.. తిరుపతి గోవింద ధామంలో అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నారు. సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ… తిరుమల రానున్నారు. డాలర్ శేషాద్రి పార్థివదేహానికి నివాళులు అర్పించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆలయ ఓఎస్డీ డాలర్ శేషాద్రి సోమవారం తెల్లవారుజామున మృతిచెందారు. విశాఖపట్నంలో కార్తీక దిపోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన.. అక్కడే గుండెపోటు రావడంతో తుది శ్వాస విడిచారు. ఆంధ్ర మెడికల్ కాలేజీ అనాటమీ విభాగంలో శేషాద్రి డెడ్‌బాడీకీ ఎంబాంబ్ మెంట్ చేశారు. 2 గంటల పాటు ఈ ప్రక్రియ జరిగింది. ఆ తర్వాత విశాఖ నుంచి తిరుపతికి శేషాద్రి భౌతికకాయాన్ని తరలించారు. ఈ సందర్భంగా ఆయన భౌతిక కాయాన్ని చూసి భక్తులు, శ్రేయోభిలాషులు చలించిపోయారు. తిరుమల వెంకన్న స్వామితో ఆయన సుదీర్ఘ అనుబంధం గుర్తు చేసుకున్నారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, శ్రీ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి, త్రిదండి చినజీయర్ స్వామి సహా పలువురు ప్రముఖులు డాలర్ శేషాద్రి అకాల మరణం పై విచారం వ్యక్తం చేశారు. 1944లో తిరుమలలో జన్మించిన డాల్లర్ శేషాద్రి అసలు పేరు పాల శేషాద్రి. ఆయన పూర్వీకులు తమిళనాడులోని కంచికి చెందిన వారు. శేషాద్రి తండ్రి తిరుమల ఆలయంలో గుమస్తాగా విధులు నిర్వర్తించారు. తిరుమలలో పుట్టి.. అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేసిన శేషాద్రి… అప్పట్లోనే పీజీ అభ్యసించారు. 1978 నుంచి టీటీడీలో ఉన్న డాలర్ శేషాద్రి… జీవితాంతం స్వామిసేవలోనే తరించారు. 2007లో రిటైర్ అయినా.. శేషాద్రి సేవలు తప్పనిసరికావడంతో తిరిగి ఆయనను ఓఎస్డీగా నియమించింది టీటీడీ. దీంతో చివరి క్షణం వరకు శేషాద్రి.. శ్రీనివాసుడి సేవలో గడిపారు.