చిత్తూరు జిల్లాలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు తిరుపతి నగరంలో పలు వింతలు జరుగుతున్నాయి. మొన్నటి మొన్న భూమిలో ఉన్న వాటర్ ట్యాంక్ ఒక్కసారిగా బయటకు వచ్చింది. అలాగే ఇల్లులు భూమిలోకి కుంగిపోయాయి. ఈ ఘటనలతో నగరవాసుల్లో ఏంజరుగుతుందో అర్థంకాక అయోమయం అవుతున్నారు. తాజాగా మరో వింత ఘటన చోటుచేసుకుంది.
30 అడుగుల బోరు పైపు భూమిలో నుంచి బయటకు వచ్చిన ఘటన నిండ్ర మండలం కచ్ఛరవేడు గ్రామంలో చోటుచేసుకుంది. దొరస్వామి అనే వ్యక్తి కొన్నేళ్ల క్రితం తన పొలంలో 30 అడుగుల లోతులో బోరు వేయించాడు. నీళ్లు రాకపోవడంతో పైపులను అలానే భూమిలో వదిలేశాడు. కాగా, భారీగా కురిసిన వర్షాలకు, పెరిగిన భూగర్భ జలాల మట్టంతో.. 30 అడుగుల బోరు పైపు పైకి వచ్చింది. ఏకంగా భూమిలో నుంచి బయటకు వచ్చి నిటారుగా నిలబడింది. దీన్ని స్థానికులు ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఈ వింతను చూసేందుకు క్యూ కట్టారు.