జాతీయం

కీలక నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం

కరోనా వల్ల చనిపోయిన కుటుంబాలకు రూ. 50 వేల పరిహారం
రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి పరిహారం

స్టాలిన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించినప్పటి నుంచి పరిపాలనలో తనదైన శైలిని చూపిస్తున్నారు. ఆయన తీసుకున్న పలు నిర్ణయాలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకున్నాయి. తాజాగా ఆయన మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తమిళనాడులో కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు రూ. 50 వేల పరిహారాన్ని ఇవ్వాలని స్టాలిన్ నిర్ణయించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులను ఈరోజు ప్రభుత్వం జారీ చేసింది. ఈ సహాయాన్ని రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి అందించనున్నారు.

ప్రభుత్వ లెక్కల ప్రకారం తమిళనాడులో ఇప్పటి వరకు 2,800 మంది కరోనాతో మృతి చెందారు. మన దేశంలో కరోనా తొలి కేసు నమోదయినప్పటి నుంచి ప్రభుత్వం అందించే సాయం వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసర్చ్, కేంద్ర ఆరోగ్యశాఖ సంయుక్తంగా జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం కరోనాతో మృతి చెందినట్టు నిర్ధారణ అయిన కుటుంబాలకే ఈ పరిహారం వర్తిస్తుంది.