తమిళనాడులోని ఆర్మీ హెలికాప్టర్ కుప్పకూలిన ఘటనలో 11 మంది చనిపోయినట్టు అధికారికంగా ప్రకటించారు. మరో ముగ్గురికి 80 శాతం కాలిన గాయాలయ్యాయని చెప్తున్నారు. వాళ్ల అత్యంత పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు చెప్తున్నారు. ఆర్మీ హెలికాప్టర్ కూలిన తరువాత మంటలు చెలరేగాయి. హెలికాప్టర్ ముక్కలు ముక్కలయింది. మంటల్లో చిక్కుకుని పలువురు ఘటనా స్థలిలోనూ మృతి చెందారు.
ఈ ప్రమాదం ఎలా జరిగిందన్న విషయంపై భారత వైమానిక దళం తక్షణ దర్యాప్తు ప్రారంభించింది. హెలికాప్టర్ ప్రమాద సమయంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌తో పాటు, ఆయన భార్య సహా మొత్తం 14 మంది ఉన్నారు. మృతుల్లో బిపిన్ రావత్ సతీమణి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బిపిన్ రావత్ పరిస్థితిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ ప్రమాద ఘటనపై కేంద్ర ప్రభుత్వం రేపు (గురువారం) పార్లమెంటులో ప్రకటన చేయనుంది.
రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రమాద వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరించారు. అటు కేంద్రCDC కేబినెట్ కూడా అత్యవసరంగా సమావేశమై.. పరిస్థితిని సమీక్షించింది. అనంతరం రాజ్ నాథ్ సింగ్ ఢిల్లీలోని సిడిఎస్ బిపిన్ రావత్ నివాసానికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు.
అటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఘటనా స్థలిని సందర్శించేందుకు చెన్నై నుంచి కోయంబత్తూరుకు బయలుదేరి వెళ్లారు. అక్కడి నుంచి ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించనున్నారు. అటు ఐఎఎఫ్ చీఫ్ వీఆర్ చౌదరీ ఢిల్లీ నుంచి సూలూర్ ఎయిర్ బేస్ ప్రాంతానికి బయలుదేరారు. ఆయన కాసేపట్లో ఘటనా స్థలికి చేరుకోనున్నారు. బిపిన్ రావత్‌ను భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్‌గా కేంద్రం నియమించింది. ఆర్మీ చీఫ్‌గా రిటైరయిన తరవాత ఆయన ఈ పదవి చేపట్టారు. త్రివిధ దళాలకు అధిపతిగా వ్యవహరిస్తున్నారు.