అంతర్జాతీయం ముఖ్యాంశాలు

Omicron | 57 దేశాలకు విస్తరించిన ఒమిక్రాన్‌.. యూరప్‌లో దిగజారుతున్న పరిస్థితి

మహమ్మారి కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ప్రపంచదేశాలకు వేగంగా విస్తరిస్తున్నది. ఇప్పటి వరకు 57 దేశాల్లో కొత్త వైరస్‌ కేసులు నమోదయ్యాయి. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో కేసులు, ఆసుపత్రిలో చేరిన రోగుల సంఖ్య పెరుగుతున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. మరో వైపు యూరప్‌లో దారుణ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందని స్థానిక ఆరోగ్య సంస్థ పేర్కొంది. కరోనా కారణంగా మరణాలు, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య నిరంతరం పెరుగుతున్నదంటూ యూరోపియన్ సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ (ECDC) ఆందోళన వ్యక్తం చేసింది.

ఆంక్షల బాటలో యూరోపియన్‌ దేశాలు

ఐరోపాలో కొత్త వేరియంట్‌ వ్యాప్తిగా వేగంగా సాగుతున్నది. ఈ క్రమంలో యూరోపియన్‌ యూనియన్‌ దేశాలు వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు మళ్లీ నిబంధనలను కఠినతరం చేస్తున్నాయి. రెస్టారెంట్లు, బార్లలో టీకాలు తీసుకోని వ్యక్తులను నిషేధించడంతో పనిచేసే చోట్ల పని గంటలు తగ్గింపు తదితర చర్యలు తీసుకుంటున్నాయి. కేసుల సంఖ్య పెరుగుతోందని ఈసీడీసీ డైరెక్టర్‌ ఆండ్రియా అమ్మోన్ తెలిపారు. మరో వైపు కరోనా కొత్త వేరియంట్‌ తీవ్రతను అంచనా వేసేందుకు ప్రస్తుతం ఉన్న డేటా సరిపోదని డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. అయితే, డెల్టా వేరియంట్‌ కంటే తీవ్రమైన ప్రభావం చూపడం లేదని తెలిపింది. డబ్ల్యూహెచ్‌కు చెందిన ఎమర్జెన్సీ మెడిసిన్ డైరెక్టర్ మైఖేల్ ర్యాన్ మాట్లాడుతూ.. వేరియంట్‌ వేగంగా విస్తరించిన.. తీవ్రత తక్కువగానే ఉన్నదని ప్రాథమిక డేటా చూపుతుందన్నారు. ఏది ఏమైనా చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు.

దక్షిణాఫ్రికాలో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య డబుల్‌

కొవిడ్ -19 కారణంగా ఆసుపత్రిలో చేరిన వారి సంఖ్య ముందు రోజుతో పోలిస్తే రెండింతలు పెరిగింది. ఒమిక్రాన్‌ తొలి కేసు దక్షిణాఫ్రికాలో నమోదైన విషయం తెలిసిందే. నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కమ్యూనికేబుల్ డిసీజెస్ (NICD) ప్రకారం.. గత 24 గంటల్లో 383 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు రోజు 175 ఆసుపత్రుల్లో చేరారు. బ్లూమ్‌బర్గ్‌ నివేదిక ప్రకారం.. కొత్తగా నమోదైన 13,147 కొత్త కేసుల్లో 64 శాతం గౌటెంగ్ ప్రావిన్స్‌లో ఉన్నాయి. ఈ ప్రావిన్స్‌లో జోహన్నెస్‌బర్గ్, ప్రిటోరియా ఉన్నాయి.