ఆంధ్రప్రదేశ్ జాతీయం

సాయి తేజ చివరిగా తన భార్య తో మాట్లాడిన మాటలు

బుధువారం మధ్యాహ్నం 12 : 20 సమయంలో తమిళనాడు కూనూరు సమీపంలో ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ తో పాటు మరో 12 మంది మృతి చెందారు. ఈ 12 మంది లో చిత్తూరు జిల్లా వాసి సాయితేజ కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లా కురబలకోట ఎగువ రేగడ గ్రామానికి చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్‌గా విధులు నిర్వహిస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా సాయితేజ విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదంలో అతడు కూడా మృతి చెందాడు .

అయితే సాయి తేజ చివరగా తనతో మాట్లాడినట్లు భార్య శ్యామల చెప్పుకొచ్చింది. బుధవారం ఉదయం 8.45 గంటలకు మాట్లాడారు. భార్య, పాపను వీడియోకాల్‌లో చూస్తూ తాను చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ బిపిన్‌ రావత్‌తో కలిసి తమిళనాడు వెళుతున్నానని.. వీలు కుదిరితే సాయంత్రం చేస్తానని..‘పాప దర్శిని ఏం చేస్తోంది.. మోక్షజ్ఞ స్కూల్‌కు వెళ్లాడా.. చిట్టితల్లిని చూడాలని ఉంది’ అని అన్నాడట. సాయితేజకు 2016లో శ్యామలతో వివాహం జరిగింది. వీరికి కుమారుడు మోక్షజ్ఞ (5), పాప దర్శిని (2) సంతానం. కుమారుడు మోక్షజ్ఞ చదువు కోసం సాయితేజ భార్య శ్యామల మదనపల్లె ఎస్‌బీఐ కాలనీ రోడ్‌ నెం.3లో ఇల్లు అద్దెకు తీసుకుని ఉంటున్నారు. సాయితేజ చివరిగా సెప్టెంబర్‌లో వినాయక చవితికి స్వస్థలానికి వచ్చి వెళ్లారు.

28 ఏళ్ల సాయితేజ 2013లో బెంగళూరు రెజిమెంట్‌కు ఆర్మీ సిపాయిగా ఎంపికయ్యారు. అక్కడ శిక్షణ పొందుతూ డిపార్ట్‌మెంట్‌కు సంబంధించిన పరీక్షలు రాసి ఏడాది తర్వాత ప్యారా కమాండోగా ఎంపికై 11వ పారాలో లాన్స్‌నాయక్‌గా నియమితులయ్యారు. విధి నిర్వహణలో భాగంగా కశ్మీర్, బెంగళూరు హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేశారు. ప్రస్తుతం ఢిల్లీలోబిపిన్‌ రావత్‌ వద్ద పర్సనల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు.