యువతకు సామాజిక, రాజకీయ స్పృహ ఉన్నప్పుడే దేశంలో ప్రాథమిక అంశాలైన విద్య, ఆహారం, దుస్తులు, ఆరోగ్యం తదితరాలు చర్చకు వస్తాయని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. ప్రజాస్వామ్యం బలోపేతం కావాలంటే యువత ప్రజా జీవితంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలోని సమస్యలపై జరుగుతున్న చర్చల్లో విద్యార్థులు పాల్గొనాలన్నారు. ఢిల్లీలోని నేషనల్ లా యూనివర్సిటీ 8వ స్నాతకోత్సంలో ఆయన మాట్లాడారు.
అన్యాయాన్ని ఎదిరించడంలో విద్యార్థులు అన్ని వేళలా ముందు ఉంటున్నా.. గడిచిన 50 ఏండ్లలో విద్యార్థుల నుంచి ఒక్క పెద్ద రాజకీయ నేత కూడా తయారు కాలేదని పేర్కొన్నారు. ‘విద్యార్థుల ఆలోచనల్లో స్పష్టత, సమస్యలపై అవగాహన, వాటిపై చర్చించినప్పుడే వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లగల నాయకులుగా ఎదుగుతారు. స్వేచ్ఛకు, న్యాయానికి, సమానత్వానికి యువతే రక్షకులు’ అన్నారు. కార్యక్రమంలో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ హైకోర్టు సీజే డీఎన్ పటేల్ పాల్గొన్నారు.