జాతీయం

వీరులకు జాతి నివాళి

  • పార్లమెంటు ఉభయ సభల సంతాపం
  • నిరసనలు మాని పాల్గొన్న విపక్ష ఎంపీలు
  • ఐఏఎఫ్‌ ఉన్నత స్థాయి దర్యాప్తు
  • ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర నేతృత్వం
  • పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌
  • ఢిల్లీకి సైనికుల పార్థివ దేహాలు

భారతదేశ తొలి సీడీఎస్‌ జనరల్‌ బిపిన్‌ రావత్‌, ఆయన భార్య మధూలికతో పాటు హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించిన 11 సైనికులకు పార్లమెంటు సంతాపం తెలిపింది. హెలికాప్టర్‌ కూలిన ఘటనపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉభయ సభల్లో గురువారం ప్రకటన చేశారు. ఎంపీలందరూ సైనికులకు నివాళిగా 2 నిమిషాలు మౌనం పాటించారు. ఎంపీల సస్పెన్షన్‌కు వ్యతిరేకిస్తూ చేపట్టిన నిరసనలను విపక్షాలు గురువారం రద్దు చేశాయి. సైనికులకు నివాళులర్పించాయి. అయితే సస్పెన్షన్‌కు గురైన 12 మంది ఎంపీలు నివాళులర్పించడానికి సభలోకి అనుమతించకపోవడాన్ని ఖండించాయి. ప్రమాద ఘటనపై ఐఏఎఫ్‌ త్రివిధ దళాల దర్యాప్తునకు ఆదేశించినట్టు రాజ్‌నాథ్‌ సింగ్‌ పార్లమెంటుకు తెలిపారు. దీనికి ఎయిర్‌ మార్షల్‌ మానవేంద్ర సింగ్‌ నేతృత్వం వహిస్తారని పేర్కొన్నారు. ప్రమాదం నుంచి ప్రాణాల తో బయటపడ్డ గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ ప్రస్తుతం బెంగళూరులో చికిత్స పొందుతున్నారని, ఆయన లైఫ్‌ సపోర్ట్‌పై ఉన్నట్టు తెలిపారు.

పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు

బిపిన్‌ రావత్‌కు పూర్తి సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని రాజ్‌నాథ్‌సింగ్‌ ప్రకటించారు. మిగతా సైనికులను కూడా అధికారిక లాంఛనాలతో కుటుంబసభ్యులకు అప్పగిస్తామని తెలిపారు. కాగా, తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌, తమిళనాడు సీఎం స్టాలిన్‌ మద్రాస్‌ రెజిమెంటల్‌ సెంటర్‌లో బిపిన్‌ రావత్‌, సైనికులకు నివాళులర్పించారు. అనంతరం సైనికుల పార్థివ దేహాలను కోయంబత్తూర్‌కు అక్కడి నుంచి సీ-130జే ఎయిర్‌ క్రాఫ్ట్‌లో ఢిల్లీకి తరలించారు.