- విపక్షాల ఆందోళన నడుమనే లోక్‌సభ ఆమోదం
- ఏటా నాలుగు సార్లు ఓటు నమోదు
- ప్రజా ప్రాతినిధ్య చట్టానికి సవరణలు
- తీవ్రంగా వ్యతిరేకించిన విపక్షాలు
- ప్యానల్‌కు పంపాలని డిమాండ్
- అవసరం లేదన్న కేంద్ర మంత్రి రిజిజు
- బోగస్ ఓట్లు నిర్మూలించడానికేనని వెల్లడి
ఓటర్ కార్డుకు ఆధార్ నంబర్ అనుసంధానం చేయడానికి ఉద్దేశించిన బిల్లుకు సోమవారం లోక్‌సభ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. పరిశీలన కోసం పార్లమెంటరీ ప్యానల్‌కు పంపాలని డిమాండ్ చేశాయి. బిల్లుపై సమగ్ర చర్చ జరగలేదని, ప్రజల అభిప్రాయాలు తెలుసుకొనే ప్రయత్నం చేయలేదని పేర్కొన్నాయి. ఇంత ముఖ్యమైన బిల్లును ఇంత హడావుడిగా ఎందుకు తెస్తున్నారని కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌదరి, ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే ప్రశ్నించారు.
బిల్లును పార్లమెంటరీ ప్యానల్‌కు పంపాలన్న ప్రతిపాదనను కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు కొట్టిపారేశారు. బిల్లులోని చాలా అంశాలు.. న్యాయ వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ కమిటీ సూచించినవేనన్నారు. అంతకుముందు ఆయన ఈ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. విపక్షాల ఆందోళనల మధ్యనే బిల్లుపై స్వల్ప చర్చ జరిగింది. అనంతరం మూజువాణి ఓటుతో బిల్లుకు లోక్‌సభ ఆమోదం లభించినట్టు స్పీకర్ ప్రకటించారు. దీనిపై మజ్లిస్ ఎంపీ డివిజన్ ఆఫ్ ఓట్ కోరారు. బిల్లుకు మద్దతిచ్చినవారు ఎంతమంది, వ్యతిరేకించినవారు ఎంత మంది అనేది ప్రకటించాలని కోరారు. ఈ అభ్యర్థనను స్పీకర్ తిరస్కరించారు. బిల్ పాస్ అయిన వెంటనే లోక్‌సభను మంగళవారానికి వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు.
ఆధార్ లేదని తిరస్కరించవద్దు
బోగస్ ఓట్లను నిర్మూలించడంతో పాటు ఎన్నికల సంస్కరణల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి పలు సవరణలు ప్రతిపాదించింది. దీనిని ఎన్నికల చట్టాల (సవరణ) బిల్లు-2021 పేరుతో లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్రం ప్రతిపాదించిన సవరణల ప్రకారం.. ఓటరుగా తన పేరును నమోదు చేసుకొనే వ్యక్తి ఆధార్ వివరాలు సమర్పించవలసిందిగా సంబంధిత అధికారులు కోరవచ్చు. ఇప్పటికే ఓటరు జాబితాలో ఉన్నవారి వివరాలు సరైనవా కావా నిర్ధారించుకోవడం కోసం కూడా అధికారులు ఆధార్ వివరాలను అడగవచ్చు. అయితే, ఆధార్ వివరాలు సమర్పించలేదన్న కారణంతో ఏ వ్యక్తి దరఖాస్తును తిరస్కరించరాదు. అలాగే ఓటరు జాబితాలో ఉన్న ఏ ఒక్కరి పేరును తొలగించరాదు. ఆధార్‌కు బదులుగా దరఖాస్తుదారులు వేరే ధ్రువ పత్రాలను సమర్పించవచ్చు. ఇందుకోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 23కు సవరణలు చేశారు.
భార్య స్థానంలో భాగస్వామి
ఎన్నికల సంస్కరణల్లో భాగంగా ఓటరు నమోదు ప్రక్రియను ప్రతీ సంవత్సరం నాలుగు సార్లు చేపట్టే విధంగా చట్టానికి సవరణలు చేశారు. ఇప్పటివరకు.. ఏదైనా రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే ఆ సంవత్సరం జనవరి 1 నాటికి 18 ఏండ్లు నిండితేనే ఓటరు కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి వీలుండేది. ఈ బిల్లు చట్టం అయితే ప్రతీ సంవత్సరం జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను కటాఫ్‌గా నిర్ణయించి ఓటరు నమోదు ప్రక్రియ చేపడతారు. ఇందుకోసం చట్టంలోని సెక్షన్ 14కు సవరణలు చేశారు. లింగ సమానత్వంలో భాగంగా తాజా బిల్లులో సర్వీస్ ఓటర్లకు సంబంధించిన నిబంధనలు మార్చారు. సాయుధ బలగాల్లో పనిచేస్తున్న మహిళల భర్తలను కూడా సర్వీస్ ఓటర్లుగా పరిగణించనున్నారు. ఇందు కోసం ప్రజా ప్రాతినిధ్య చట్టంలో సెక్షన్ 20లో ‘భార్య’ స్థానంలో ‘భాగస్వామి’ అని చేర్చారు.
పౌరులు కాని వారికీ ఓటు హక్కు
ఓటు హక్కు దేశ పౌరులకే ఉంటుంది. ఆధార్ కార్డును ఈ దేశ పౌరులు కాకపోయినప్పటికీ ఇక్కడ నివాసం ఉండేవారికి కూడా ఇస్తారు. తాజా బిల్లు ప్రకారం ఓటరు నమోదుకు ఆధార్‌ను ధ్రువీకరణ పత్రంగా సమర్పించవచ్చు. అంటే ఈ దేశ పౌరులు కానివారు కూడా ఓటు హక్కు పొందే అవకాశం లభిస్తుంది. ఆధార్ కార్డు దుర్వినియోగం అయ్యే ప్రమాదం ఉంది.
- శశి థరూర్, కాంగ్రెస్ ఎంపీ
హక్కులకు భంగం
వ్యక్తిగత గోప్యతకు సంబంధించి సుప్రీం కోర్టు నిర్దేశించిన ప్రమాణాలను ఈ బిల్లు ఉల్లంఘిస్తున్నది. ప్రాథమిక హక్కులకు భంగం కలిగిస్తున్నది.
- అసదుద్దీన్ ఒవైసీ, మజ్లిస్ ఎంపీ