జాతీయం ముఖ్యాంశాలు

అణ్వస్త్ర సత్తా చాటేందుకే బ్రహ్మోస్‌ తయారీ

ప్రపంచంలోని ఏ దేశమూ భారత్‌పై దాడికి దిగే సాహసం చేయకూడదనే బ్రహ్మోస్‌ అణ్వస్త్ర క్షిపణులను తయారుచేస్తున్నామని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ స్పష్టంచేశారు. లక్నోలో రక్షణ సాంకేతికత, ప్రయోగ కేంద్రం, నూతన బ్రహ్మోస్‌ ఆయుధ కర్మాగారాలకు రాజ్‌నాథ్‌ శనివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘భారత్‌ బ్రహ్మోస్‌ సహా ఇతర ఆయుధాలను తయారుచేస్తోందంటే అర్ధం.. ఇతర దేశాలపై దాడికి సిద్ధమైందని కాదు.

కయ్యానికి కాలు దువ్వేందుకు ప్రయత్నించే దేశాలకు భారత తన అణ్వస్త్ర సామర్థ్యాన్ని చాటిచెప్పేందుకే ఇలా క్షిపణులను తయారుచేస్తోంది. భారత్‌కు చెడు చేయాలని పొరుగుదేశం(పాక్‌) ఎందుకు అనుక్షణం పరితపిస్తోందో నాకైతే అర్ధంకాలేదు’ అని రాజ్‌నాథ్‌ అన్నారు. బ్రహ్మోస్‌ యూనిట్‌ కోసం అడిగిన వెంటనే 200 ఎకరాల స్థలం కేటాయించారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను రాజ్‌నాథ్‌ అభినందించారు. ఈ రెండు యూనిట్లను డీఆర్‌డీవో నెలకొల్పుతోంది. యూనిట్‌లో బ్రహ్మోస్‌ కొత్త తరం వేరియంట్‌ క్షిపణులను రూపొందిస్తారు. ఏడాదికి దాదాపు వంద క్షిపణులను తయారుచేస్తారు.