తెలంగాణ మద్యం ప్రియులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు తెలిపింది. మరో రెండు రోజుల్లో 2021 కి గుడ్ బై చెప్పి 2022 కు గ్రాండ్ గా వెల్ కం చెప్పబోతున్నాం. ఈ తరుణంలో తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బార్లు, వైన్ షాపులకు మినహాయింపు ఇచ్చింది. డిసెంబర్ 31, 2022 జనవరి 1వ తేదీల్లో బార్లు, క్లబ్బులు అర్థరాత్రి ఒంటి గంట వరకు తెరిచి ఉంచేందుకు అనుమతించింది. అలాగే డిసెంబర్ 31న వైన్ షాపులు సైతం అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచే ఉంటాయని చెప్పింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కరోనా నిబంధనలు కచ్చితంగా పాటించేలా చర్యలు తీసుకోవాలని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖకు సూచించారు.
ఒమిక్రాన్ కేసులు చాపకింద నీరుగా పెరుగుతున్న వేళ న్యూఇయర్ వేడుకలపై దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు విధిస్తున్న తరుణంలో సర్కార్ ఇలా మినయింపు ఇవ్వడం ఏంటి అని కొంతమంది విమర్శిస్తున్నారు. మరోపక్క ఏపీలోనూ డిసెంబర్ 31న అర్ధరాత్రి వరకు మద్యం షాపులు ఓపెన్ చేసుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మద్యం షాపులను డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల వరకు, బార్ షాపులను అర్ధరాత్రి ఒంటిగంట వరకు ఓపెన్ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.