జాతీయం ముఖ్యాంశాలు

తమిళనాడులో న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు..

ఓమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు న్యూ ఇయర్ వేడుకల ఫై ఆంక్షలు విధిస్తున్నారు. ఈ తరుణంలో తమిళనాడు సర్కార్ సైతం న్యూ ఇయర్ వేడుకల ఫై ఆంక్షలు విధించారు. రాష్ట్రవ్యాప్తంగా బీచ్‌లు, బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిషేధించింది. ఈ మేరకు తమిళనాడు డీజీపీ ఒక ప్రకటనలో వెల్లడించారు.

బహిరంగ ప్రదేశాలతో పాటు రెస్టారెంట్లు, క్లబులు, పబ్‌లలో కొత్త ఏడాది వేడుకులను అనుమతించేది లేదని డీజీపీ స్పష్టం చేశారు. కొత్త ఏడాదిలో మెరీనా బీచ్, ఎల్లియాట్స్ బీచ్, నీలంకారీ, ఈస్ట్ కోస్ట్ రోడ్ వంటి పబ్లిక్ ప్లేసుల్లో ప్రజలు ఎవరూ గుంపుగా తిరగరాదని అధికారులు సూచించారు. ప్రతిఒక్కరూ తప్పనిసరిగా కొవిడ్ నిబంధనలు పాటించాల్సిందేనని చెన్నై పోలీసులు పేర్కొన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో వాహనదారులకు పోలీసులు పలు సూచనలు చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే అరెస్టు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. రాత్రి 11 గంటలలోపు కార్యకలాపాలను ముగించాలి. కొత్త సంవత్సర వేడుకల్లో భాగంగా ప్రైవేట్ పార్టీలకు కూడా ఆంక్షలు వర్తిస్తాయి. కుటుంబ సమేతంగా ఇంటి వద్దే నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని ఇదివరకే రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తాజాగా తెలంగాణ ప్రభుత్వం కూడా ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. డిసెంబర్ 31 నుండి జనవరి 2 వరకు ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించింది. పబ్లిక్ ఈవెంట్స్‌లో భౌతిక దూరం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. మాస్క్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. అలాగే న్యూ ఇయర్ వేడుకల్లోనూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించింది.