పంజాబ్‌లో విద్యుత్తు కొరత తీవ్రంగా ఉంది. దీంతో ఆ రాష్ట్ర సీఎం అమరీందర్ సింగ్ కొన్ని ఆదేశాలు జారీ చేశారు. విద్యుత్తు వినియోగాన్ని తగ్గించాలన్నారు. సీఎం ఇచ్చిన పిలుపు మేరకు ప్రభుత్వ ఉద్యోగులు ఇవాళ తమ ఆఫీసుల్లో ఏసీలను ఆపేశారు. విద్యుత్తును మితంగా వాడలన్న ఉద్దేశంతో పంజాబీ ప్రభుత్వోద్యోగులు తమ కార్యాలయాల్లో ఏసీలు ఆఫ్ చేసి కేవలం ఫ్యాన్లు వాడుతున్నారు. అన్ని ఆఫీసుల్లో ఏసీలను ఆపేసినట్లు ఉద్యోగ సంఘాల నేత ఒకరు తెలిపారు.
నిజానికి ఉత్తర భారత దేశంలో తీవ్రమైన ఎండలు మండుతున్నాయి. దీంతో అక్కడ విద్యుత్తుకు భారీ డిమాండ్ వచ్చింది. కొన్ని రోజుల్లోనే పంజాబ్‌లో సుమారు 14వేల మెగావాట్ల విద్యుత్తును వాడేసింది. అక్కడ సుమారు 1334 మెగావాట్ల విద్యుత్తు కొరత ఏర్పడింది. ఈ నేపథ్యంలో పంజాబ్ విద్యుత్తుశాఖ.. విద్యుత్తు సరఫరాపై ఆంక్షలు విధించింది. పవర్ సప్లయ్‌లో జరుగుతున్న అక్రమాలను వ్యతిరేకిస్తూ అక్కడ ఇటీవల ఆందోళనలు కూడా జరిగాయి. విద్యుత్తు సంక్షోభం వల్ల ప్రభుత్వ ఆఫీసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో కార్యాలయాలను ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు తెరుచుకునేలా ఆదేశాలు జారీ చేశారు.
గత కొన్ని రోజుల నుంచి కొన్ని కొన్ని ప్రాంతాల్లో గంటల కొద్దీ విద్యుత్తును నిలిపేశారు. మొహాలీ, పాటియాలా, బటిండా లాంటి ప్రాంతాల్లో దాదాపు 10 గంటలకు పైగా విద్యుత్తు సరఫరా ఆపేశారు. కపుర్తలా, ఫిరోజ్‌పూర్, లుథియానాలోనూ కొన్ని గంటల పాటు విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. వరిపంట సీజన్ సమయంలో గ్రామీణ ప్రాంత రైతులకు కూడా విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. విద్యుత్తు నియంత్రణ కోసం అమరీందర్ ప్రభుత్వం సరైన ఏర్పాట్లు చేయలేదన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో స్థానిక ప్రభుత్వం ఆంక్షలను తీవ్రతరం చేసింది.
సీఎం అమరీందర్ సింగ్ తీసుకున్న నిర్ణయాలను కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దూ ఖండించారు. సరైన దిశలో చర్యలు తీసుకుంటే విద్యుత్తు సరఫరాను నిలిపివేసే ప్రమాదం ఉండదన్నారు. అమరీందర్ పాలనలో పంజాబ్ దారుణంగా విఫలమైనట్లు అకాలీదళ్ నేత హర్‌సిమ్రత్ కౌర్ బాదల్ అన్నారు. రాష్ట్రంలో 10 నుంచి 12 గంటల పాటు కోత విధిస్తున్నారని, విద్యుత్తుపై ఇచ్చే సబ్సిడీని ఆదా చేయాలనుకుంటున్నారని ఆమె ఆరోపించారు. రైతులు తమ పంటల్ని స్వయంగా నాశనం చేసుకోవాల్సి వస్తోందన్నారు. బటిండాలో గురువారం అత్యధికంగా 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయ్యింది.