కరోనా మహమ్మారి మరోసారి ప్రపంచ వ్యాప్తంగా విజృభిస్తుంది. అమెరికా లో అయితే ఒక్క రోజే 4.65 లక్షల కరోనా కేసులు వెలుగులోకి రాగా.. 1,674 మంది మరణించారు. దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య.. 54,656,645కు చేరింది. మరణాల సంఖ్య 844,169కు పెరిగింది. రెండు వారాల వ్యవధిలో కొత్త కేసుల సంఖ్య రెట్టింపునకు మించి పెరిగింది. సిబ్బంది కొరతతో అనేక విమాన సర్వీసులు రద్దయ్యాయి. వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ వల్ల పండగ సీజన్‌పై తీవ్ర ప్రభావం పడింది. అయితే, వ్యాక్సిన్లు తీసుకున్న వ్యక్తులు ఇంట్లోనే వేడుకలు నిర్వహించుకోవచ్చని అమెరికా అంటువ్యాధుల నిపుణులు డాక్టర్ ఆంటోనీ ఫౌచీ తెలిపారు.
ఇక ఇండియా లోను కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల వ్యవధిలో 13,154 కేసులు వెలుగులోకి రాగా , 268 మంది ప్రాణాలు కోల్పోయారు. 7,486 మంది కోలుకున్నారు. మరోవైపు, ఒమిక్రాన్ కేసుల సంఖ్య 961కి చేరింది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు ఆందోళనకర రీతిలో నమోదవుతున్నాయి. ఒక్కరోజే 16 లక్షల కేసులు వెలుగులోకి వచ్చాయి. ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు.