తెలంగాణ రాష్ట్రంలో ఓమిక్రాన్ కేసులు రోజు రోజుకు భారీగా పెరుగుతున్నాయి. ప్రస్తుతం వందకు చేరువలో ఉన్నట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఈరోజు ఒక్క రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కొత్త ఓమిక్రాన్ కేసులు బయటపడినట్లు తెలిపింది. ఈ కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసుల సంఖ్య 84కి పెరిగింది. వీరిలో 32మంది కోలుకున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం మరింతగా అలర్ట్ అవుతూ..హాస్పటల్ వర్గాలను అలర్ట్ చేస్తుంది. ఆసుపత్రుల్లో అన్ని రకాల సౌకర్యాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలని అధికారులను ఆదేశించింది.
కొవిడ్ నిబంధనలు పాటించని వారి పట్ల కఠినంగా వ్యవహరించాలని చెపుతున్నారు. కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను పొడిగించింది. ఈ నెల 10వ తేదీ వరకు సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన కార్యక్రమాలపై నిషేధం విధించింది. జనం గుమిగూడే అన్ని కార్యక్రమాలపై ఈ నెల 10వ తేదీ వరకు ఆంక్షలు కొనసాగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక ఏపీ విషయానికి వస్తే ..గడిచిన 24 గంటల్లో 24,219 నమూనాలు పరీక్షించగా.. కొత్తగా 165 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ వల్ల నెల్లూరులో ఒకరు, కృష్ణా జిల్లాలో ఒకరు మరణించారు.