సినిమా ఒక వస్తువు కాదు.. వినోద సేవ మాత్రమే ..పేర్ని నాని
ఏపీలో సినిమా టికెట్ల రేట్లు తగ్గింపు వివాదం ముదురుతోంది. ఈ అంశంపై టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, ఏపీ మంత్రి పేర్ని నాని మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. టికెట్ల వ్యవహారంపై ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ దర్శకుడు వర్మ చేసిన ట్వీట్ కు ఏపీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆర్జీవి ట్వీట్లకు జతచేస్తూ.. వర్మ అడిగిన ఒక్కో ప్రశ్నకు తనదైన స్టైల్లో స్పందిస్తూ.. ఆర్జీవికి పలు ప్రశ్నలు సందించాడు.
- “గౌరవనీయులైన @RGVzoomin గారూ… మీ ట్వీట్లు చూశాను. నాకు ఉన్న సందేహాన్ని తెలియపరుస్తున్నాను. రూ.100 టికెట్ ను రూ.1000 కి, 2000కి అమ్ముకోవచ్చని ఏ బేసిక్ ఎకనమిక్స్ చెప్పాయ్? ఏ చట్టం చెప్పింది? దీన్ని ఏ మార్కెట్ మెకానిజం అంటారు? డిమాండ్ & సప్లై అంటారా? లేక బ్లాక్ మార్కెటింగ్ అంటారా?..
- ఉప్పూ పప్పూ లాంటి నిత్యావసర వస్తువుల ధరల్ని మాత్రమే ప్రభుత్వం నియంత్రించవచ్చుగానీ, సినిమా టికెట్ల ధరల్ని ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందని అడిగారు. థియేటర్లు అనేవి ప్రజా కోణంలో వినోద సేవలు పొందే ప్రాంగణాలు.
- సామాన్యుడి మోజుని,అభిమానాన్ని లూటీ చేసే పరిస్థితి లేకుండా చూసేందుకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు 66 ఏళ్ళుగా చట్టాలకు లోబడే సినిమా టికెట్ ధరను నిర్ణయిస్తున్నాయి.
- బలవంతంగా ధరలు తగ్గిస్తే మోటివేషన్ పోతుందన్నది ఎకనామిక్స్‌లో ప్రాథమిక సూత్రం అని చెప్పారు. ఎవరికి వర్మగారూ? కొనేవారికా? అమ్మేవారికా? మీరు ఎంతవరకు ప్రొడ్యూసర్స్ శ్రేయస్సు గురించే మాట్లాడుతూ కన్స్యూమర్ యాంగిల్‌ను గాలికి వదిలారు. కాస్త ప్రేక్షకుల గురించి కూడా ఆలోచించండి వర్మ గారూ.
- సినిమాను అత్యవసర సర్వీసుగా ప్రభుత్వం భావిస్తుంటే… మెడికల్, ఎడ్యుకేషన్ మాదిరిగానే సబ్సిడీని ప్రభుత్వం భరించాలని అడిగారు. సినిమాను మేం నిత్యావసరంగా గానీ, అత్యవసరంగా గానీ భావించటం లేదు @RGVzoomin గారూ.
- హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు @RGVzoomin గారూ.
- థియేటర్‌లో సినిమా టికెట్ల ధరల్ని ప్రేక్షకులకు కల్పించే సౌకర్యాల ఆధారంగా నిర్ణయించాలని మాత్రమే 1970 సినిమాటోగ్రఫీ చట్టం ద్వారా వచ్చిన నిబంధనలు చెపుతున్నాయి.
- ఒక వస్తువుకు సంబంధించిన మార్కెట్ ధర నిర్ణయంలో అసలు ప్రభుత్వానికి ఉన్న పాత్ర ఏమిటో సమాధానమివ్వండని అడిగారు. సినిమా ఒక వస్తువు కాదు.అది వినోద సేవ మాత్రమే.ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని మేం చేస్తున్నది థియేటర్లలో టికెట్ ధరల నియంత్రణ మాత్రమే తప్ప,సినిమా నిర్మాణ నియంత్రణ ముమ్మాటికీ కాదు
- మీకు కింది నుంచి మద్దతు ఇవ్వటానికి ప్రజలు మాకు అధికారాన్ని ఇచ్చారని,మీ నెత్తిన ఎక్కి తొక్కటానికి కాదన్నారు.సినిమా టికెట్‌ను ఎంతకైనా అమ్ముకోనిస్తే పరిశ్రమకు కింది నుంచి బలాన్ని ఇచ్చినట్టు.సామాన్యుడిని దోచుకోకుండా ఆపితే మీ నెత్తిన ఎక్కి తొక్కినట్టు మీరు ప్రవచించటం సబబేనా వర్మ గారూ? అని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు.