దేశంలో మళ్ళీ కరోనా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఈ మహమ్మారి ఉగ్రరూపం దాల్చడంతో వివిధ రాష్ట్రాల్లో భారీగా కొత్త కేసులు నమోదవుతూ ఆందోళల కలిగిస్తున్నాయి. మహారాష్ట్రలో కరోనా కేసులతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా పెరుగుతున్నాయి. తాజాగా దేశ ఆర్ధిక రాజధాని ముంబైలోని సియోన్ ఆస్పత్రిలో మరో 30 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ఇప్పటికే ముంబైలో 230 మంది వైద్యులకు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. తాజాగా మరో 30మంది వైద్యులు కరోనా బారిన పడడంతో..రాష్ట్రంలో కరోనా మహమ్మారి బారిన పడిన రెసిడెంట్ డాక్టర్ల సంఖ్య 260 కు చేరుకుందని మహారాష్ట్ర రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది.
ఈ వైద్యులు అంతా కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే కోవిడ్ బారినపపడడం కలకలం రేపుతోంది. నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్సనందిస్తున్న డాక్టర్లు తక్కువ వ్యవధిలోనే వైరస్ కోరల్లో చిక్కుకోవడంతో సర్వత్రా ఆందోళలన వ్యక్తం అవుతోంది. మరోవైపు రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా కేసులతో పాటు.. ఒమిక్రాన్ కేసులతో ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కాలేజీల క్యాంపస్ లను ఫిబ్రవరి 15 వరకూ సెలవులను ప్రకటించింది. అయితే విద్యార్థులకు ఆన్ లైన్ లో విద్యాబోధన నిర్వహిచనున్నామని విద్యా శాఖ మంత్రి ఉదయ్ సమంత్ ప్రకటించారు.