కరోనాతో పాటు ఒమిక్రాన్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కాగా కరోనా కేసులు పెరుగుతుండటంతో కర్ణాటక రాష్ట్రం కూడా పలు ఆంక్షలు విధించింది. ఈ మేరకు నేటి నుంచే వీకెండ్ కర్ఫ్యూని విధించినట్లు వెల్లడించింది. ఈ మేరకు ఉత్తర్వులను కూడా జారీ చేసింది. నేటి రాత్రి 10గంటల నుంచి సోమవారం ఉదయం 5గంటల వరకు వారాంతపు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని వెల్లడించింది. ఈ వీకెండ్ కర్ఫ్యూ లో భాగంగా థియేటర్లు, మాల్స్, పబ్‌లు, బార్‌లు, రెస్టారెంట్లు, హోటళ్లు, సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్‌లు, ఆడిటోరియంలు 50 శాతం సామర్థ్యంతో పని చేస్తాయి. అయితే ఇందులో రెండు డోసుల కరోనా వ్యాక్సిన్ తీసుకున్నవారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.
ఇదే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి సమావేశాలకు అనుమతి ఉండదు. ఈ కర్ఫ్యూ సందర్భంగా అన్ని ఆఫీసులు సోమవారం నుంచి శుక్రవారం వరకు వారానికి ఐదు రోజులు మాత్రమే పని చేస్తాయి. ప్రభుత్వ సచివాలయంలోని సిబ్బంది 50 శాతం సామర్థ్యంతో పని చేయాలి. అది కూడా అండర్ సెక్రటరీ స్థాయి కంటే తక్కువ స్థాయి అధికారులతో కొనసాగుతుంది. ఈ వీకెండ్ కర్ఫ్యూ సమయంలో ప్రజల అత్యవసర ప్రయోజనాల తీర్చడానికి సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాల మేరకు బీఎంఆర్ సీఎల్ (BMRCL)తో పాటు ప్రజా రవాణా వ్యవస్థ పని చేయనుంది. అందరూ తప్పనిసరిగా మాస్క్ లను ధరించాలని తెలిపింది. శానిటైజర్ ని వాడాలని సూచించింది.