ఆంధ్రప్రదేశ్

జాబ్ కాలెండర్ రాదు, పరిశ్రమలు రావు: లోకేశ్

స్వామి వివేకానంద జయంతి శుభాకాంక్ష‌లు: నారా లోకేశ్

స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఏపీ స‌ర్కారుపై టీడీపీ నేత‌ నారా లోకేశ్ తీవ్ర విమర్శ‌లు గుప్పించారు. ఏపీ స‌ర్కారుకి యువ‌త బుద్ధి చెప్పే రోజులు వ‌స్తాయ‌ని, అప్పటి వ‌ర‌కు మార్పు కోసం కృషి చేద్దామ‌ని పేర్కొన్నారు. ‘భారతీయ యువతరంలో చైతన్యం నింపడానికి, ఆత్మ విశ్వాసం కలిగించడానికి తన జీవితమంతా కృషి చేసిన స్వామి వివేకానంద జయంతి సందర్భంగా ఆ మహాశయుని స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను. ఈ రోజును జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్న వేళ, తెలుగు యువతకు శుభాకాంక్షలు’ అని లోకేశ్ పేర్కొన్నారు.

‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం అన్నారు వివేకానంద స్వామి. కానీ ఏపీలో యువత అడుగడుగునా నిరాశ, నిస్పృహలో కూరుకుపోయి ఉంది. జాబ్ కాలెండర్ రాదు. పరిశ్రమలు రావు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావు. స్వయం ఉపాధి రుణాలు మంజూరు కావు. విదేశీ విద్యకు సాయం లేదు’ అని ఆయ‌న ఏపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. ‘యువతను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్న ఈ ప్రభుత్వానికి యువతరమే బుద్ధి చెప్పే రోజు త్వరలో రానుంది. అప్పుడు నిజమైన యువజనోత్సవాలను ఘనంగా చేసుకుందాం. అప్పటివరకు మార్పు కోసం కృషి చేద్దాం’ అని లోకేశ్ చెప్పారు.