ఆంధ్రప్రదేశ్

మరికాసేపట్లో గుంటూరులో గ్రాండ్‌ స్టార్ హోటల్ ను ప్రారభించబోతున్న ముఖ్యమంత్రి జగన్

ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. విద్యానగర్‌లో ఐటీసీ సంస్థ నిర్మించిన గ్రాండ్‌ స్టార్ హోటల్​ను ప్రారంభించనున్నారు. ఇందుకు గాను ఉదయం 10.45 గంటలకు ముఖ్యమంత్రి హెలికాఫ్టర్ ద్వారా గుంటూరు చేరుకోనున్నారు. పోలీస్ మైదానంలో హెలిప్యాడ్ వద్ద దిగి.. అక్కడినుంచి రోడ్డు మార్గం ద్వారా హోటల్​కు బయలుదేరతారు. 11గంటలకు హోటల్ ను ప్రారంభించనున్నారు. అక్కడ 45 నిమిషాల పాటు ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్ ద్వారా తాడేపల్లిలోని తన నివాసానికి బయలుదేరుతారు.

జగన్ పర్యటన నిమిత్తం జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. హెలిప్యాడ్​తో పాటు హోటల్ వద్ద పనులను అధికారులు పూర్తి చేశారు. మంత్రులు సుచరిత, చెరుకువాడ శ్రీరంగనాథరాజు.. ఏర్పాట్లను పరిశీలించారు. గుంటూరు నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. నగరంపాలెం పోలీస్ స్టేషన్ నుంచి కలెక్టరేట్, పట్టాభిపురం, స్థంబాలగరువు, గుజ్జనగుండ్ల, విద్యానగర్ మార్గంలో వాహనాల రాకపోకలు పూర్తిగా నిషేధిస్తున్నట్లు అర్బన్ ఎస్పీ అరీఫ్ హఫీజ్ తెలిపారు. ఉదయం 10గంటల నుంచి 12గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉండనున్నాయని తెలిపారు. ఇక జగన్ పర్యటన నిమిత్తం అభిమానులు, నేతలు తమ నేతకు ఘన స్వాగతం పలుకుతూ భారీ ఎత్తున ప్లెక్సీ లు ఏర్పటు చేసి..వారి అభిమానాన్ని చాటుకున్నారు.