ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

కొత్త పీఆర్సీ ప్రకారమే వేతనాలు ..ఏపీ ప్రభుత్వం ఆదేశాలు

పీఆర్సీ జీవోను వెనక్కు తీసుకోవాలని ఉద్యోగులు, టీచర్లు డిమాండ్ చేస్తున్నా, వారు ఆందోళనలను ఉద్ధృతం చేస్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల ప్రకటించిన పీఆర్సీ ప్రకారమే వేతనాలను చెల్లించేలా అన్ని ట్రెజరీ ఆఫీసులకు ప్రభుత్వం ఉత్తర్వులను పంపించింది. సవరించిన పే స్కేల్స్ ఆధారంగానే జీతాల్లో మార్పులను చేయాలని ఆదేశాలిచ్చింది. ఇటు జీతాల చెల్లింపునకు సీఎఫ్ఎంఎస్ కొత్త సాఫ్ట్ వేర్ నూ సిద్ధం చేసి పెట్టింది.

అయితే, జీవోను వెనక్కు తీసుకోవాలంటూ ఇవాళ ఇప్పటికే ఉపాధ్యాయులు కలెక్టరేట్లను ముట్టడించారు. చాలా మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటు ఉద్యోగులు కూడా ఆందోళనలను ఉద్ధృతం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవుతున్న వారు.. రేపు సీఎస్ సమీర్ శర్మను కలిసి ముందస్తు సమ్మె నోటీసును ఇవ్వనున్నారు. నిబంధనల ప్రకారం 14 రోజుల ముందే సమ్మె నోటీసు ఇవ్వాల్సి ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి ఐక్యవేదికలు ఇవాళ నిర్వహించే సమావేశంలో ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నాయి.