ఇంజినీరింగ్ చదివినా ఉద్యోగం రాలేదు
ఆత్మహత్య చేసుకునేందుకు తనకు అనుమతిని ఇవ్వాలని కోరుతూ నల్గొండ జిల్లా కనగల్ మండలంలోని ఎడవెల్లి గ్రామానికి చెందిన చొప్పరి శ్రీను అనే రైతు మంత్రి కేటీఆర్, జిల్లా కలెక్టర్ కు లేఖ రాశారు. తనకు వారసత్వంగా వచ్చిన భూమిలో వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవాడినని లేఖలో ఆయన తెలిపారు.
అయితే పల్లె ప్రకృతి వనానికి తన భూమిని తీసుకున్నారని… కొంత భూమిని గతంలో ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు కోసం సేకరించారని చెప్పారు. ఇంజినీరింగ్ చదివిన తనకు ఎలాంటి ఉద్యోగమూ లేదని… దీంతో వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్నానని తెలిపారు. ప్రస్తుతం తాను రోడ్డున పడ్డానని, జీవనం దుర్భరంగా ఉందని, తాను చనిపోయేందుకు అనుమతించాలని కోరారు. తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ కు, కనగల్ తహసీల్దార్ కు, ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని వాపోయారు.