సినీ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 14 న నల్గొండ జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ నెల 14న హుజుర్ నగర్, చౌటుప్పల్ నియోజకవర్గాలలో చనిపోయిన జనసేన క్రియాశీల కార్యకర్తల కుటుంబాలను పరామర్శించనున్నారు. దీనికి సంబదించిన ఏర్పట్లను తెలంగాణ జనసేన నేతలు , కార్య కర్తలు దగ్గర ఉండి చూసుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పర్యటన లో కేసీఆర్ సర్కార్ పై విమర్శలు చేస్తారా..లేదా అనేది ఆసక్తిగా మారింది.
ఇక ఇదిలా ఉంటె ఏపీలో అసని తూఫాన్ వణికిస్తున్న నేపథ్యంలో జగన్ సర్కార్ కు పలు సూచనలు తెలియజేసారు పవన్ కళ్యాణ్. అసని తూఫాన్ ఎఫెక్ట్ ఏపీ ఫై ఎక్కువగా ఉండడం తో రాష్ట్ర ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ముఖ్యంగా గోదావరి జిల్లాల మీద ఈ తూఫాన్ ఎఫెక్ట్ తీవ్ర స్థాయిలో కనిపిస్తోందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ప్రకృతి విపత్తు బారినపడే వారిని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. అలాగే ధాన్యం కళ్లాల్లోనే ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారని, ప్రభుత్వం తక్షణం స్పందించి రైతులకు భరోసా ఇవ్వాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశారు.
ధాన్యం సేకరణలో నిబంధనలు సడలించాలని కోరారు. 17శాతం మించి తేమ ఉండకూడదనే నిబంధన ఈ సమయంలో వర్తింపజేస్తే రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. తడిచిన, రంగు మారిన ధాన్యాన్ని కచ్చితంగా కొనుగోలు చేయాలని కోరారు. అలాగే తీరంలోని మత్స్యకార గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురుకొంటున్నారని , ఇళ్ళు దెబ్బ తిన్నవారిని ఆదుకోవాలని కోరారు. జనసైనికులు, పార్టీ నాయకులు బాధితులకు బాసటగా నిలవాలని పవన్‌కల్యాణ్ సూచించారు.