ఇంగ్లీవుడ్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీపై కాల్పులు
అమెరికాలో తుపాకి మరోమారు గర్జించింది. లాస్ ఏంజెలెస్ సమీపంలో ఇంగ్లీవుడ్‌లోని ఓ ఇంట్లో జరుగుతున్న పార్టీపై దుండగుడు జరిపిన కాల్పుల్లో నలుగురు ప్రాణాలు కోల్పోగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఈ ఘటన జరిగింది. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. తీవ్రంగా గాయపడిన మరొకరు ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు.
పార్టీపై జరిగిన ఈ మెరుపుదాడిలో ఓ రైఫిల్, హ్యాండ్‌గన్‌ను ఉపయోగించినట్టు తెలుస్తోంది. 1990 తర్వాత ఇంగ్లీవుడ్‌లో జరిగిన సింగిల్ షూటింగ్ ఘటన ఇదేనని మేయర్ జేమ్స్ బట్ తెలిపారు. చూస్తుంటే బాధితులను లక్ష్యంగా చేసుకుని ఈ దాడికి పాల్పడినట్టు కనిపిస్తోందన్నారు. ఈ ఘటనలో గాయపడిన మరో వ్యక్తి తాను మరో నగరంలోని స్ట్రీట్ గ్యాంగ్ సభ్యుడనని అంగీకరించాడని ఆయన పేర్కొన్నారు.