ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రత్యక్ష తరగతులు
పిల్లల్ని పంపాలా? వద్దా? అనేది తల్లిదండ్రుల ఇష్టానికే..
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సంక్రాంతి సెలవులకు ముందుగానే తెలంగాణ ప్రభుత్వం బడులకు సెలవులు ప్రకటించింది. అవి ముగిశాక కూడా ముందు జాగ్రత్త చర్యగా ఈ నెల 30వ తేదీ వరకు సెలవులు పొడిగించింది. అయితే, కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ మునుపటిలా అంత తీవ్రమైన పరిస్థితులు లేకపోవడంతో ప్రభుత్వం పునరాలోచనలో పడింది. బడులు తెరవాలని యోచిస్తోంది.
కరోనా వ్యాప్తి త్వరలోనే తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ కూడా అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో ఈ నెల 30వ తేదీ తర్వాత సెలవులు ముగియనుండడంతో వీలైతే ఆ తర్వాతి రోజు నుంచే బడులు తెరవాలని యోచిస్తోంది. కుదరకుంటే సెలవులు మరో వారం పొడిగించి ఫిబ్రవరి రెండో వారం నుంచి ప్రత్యక్ష తరగతులు కొనసాగించాలని భావిస్తోంది. అయితే, కరోనా భయాల నేపథ్యంలో పిల్లలను స్కూళ్లకు పంపాలా? వద్దా? అనే విషయాన్ని మాత్రం తల్లిదండ్రులకే వదిలేయాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది.