సీఎం కేసీఆర్ ఉద్యోగుల బదిలీలు అంటూ 317 జీవోను తీసుకువచ్చి ఉద్యోగులను ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నారని, ఉద్యోగ సంఘాలతో చర్చించి జీవో 317ను రద్దు చేయాలని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ డిమాండ్ చేశారు. ఈ జీవోతో ఉద్యోగులు ఇబ్బందులకు గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, ఈ నర్సంపేట వాసి ఉప్పుల రమేష్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం టీఆర్ఎస్ ప్రభుత్వమేనన్నారు. ఉప్పుల రమేష్ కుటుంబానికి బీజేపీ పార్టీ అండగా ఉంటుందని, వారి కుటుంబానికి ఆర్దిక సహాయంగా రూ. 50 వేలు అందించారు ఈటల రాజేందర్.
ఆయన మాట్లాడుతూ…. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులతో చర్చించకుండా ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. నెటివిటీ లేక ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారని పార్టీల నాయకులు చెప్పినా వినకుండా మొండి వైఖరి అవలంభిస్తున్నారన్నారు. ఉద్యోగుల ఇబ్బందులు పట్టించుకోవడం లేదని ఆయన విమర్శించారు. దేశంలో ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటన ఎక్కడ లేదని ఈటెల రాజేందర్ అన్నారు.