బీహార్ సీఎం నితీశ్ కుమార్, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత తేజస్వి యాదవ్‌లు ఇవాళ ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. రాష్ట్రంలో కుల గణన ( Caste Census ) చేపట్టాలని వాళ్లు డిమాండ్ చేశారు. పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లో మోదీతో ఆ రాష్ట్రానికి చెందిన నేతలు భేటీ అయ్యారు. ప్రధానితో భేటీ అయినవారిలో ముఖేశ్ సహాని, జితన్ రామ్ మాంజీలు కూడా ఉన్నారు. ప్రధానిని కలిసిన తర్వాత బీహార్ సీఎం నితీశ్ కుమార్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కులాల వారిగా జనాభా లెక్కలు చేపట్టాలన్న డిమాండ్‌ను ప్రధాని ఆలకించినట్లు నితీశ్ తెలిపారు. ఈ అంశంపై సరైన నిర్ణయం తీసుకోవాలని ఆయన్ను కోరినట్లు చెప్పారు. కుల గణన అంశంపై రాష్ట్ర అసెంబ్లీ రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు సీఎం నితీశ్ తెలిపారు.
ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ కూడా మీడియాతో మాట్లాడారు. కేవలం రాష్ట్రంలో మాత్రమే కాదు.. యావత్ దేశంలోనూ కుల గణన చేపట్టాలని ప్రధాని మోదీని డిమాండ్ చేసినట్లు తేజస్వి వెల్లడించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నామని తేజస్వి చెప్పారు. గతంలో బీహార్ అసెంబ్లీలో కుల గణనపై రెండు సార్లు తీర్మానాలు చేసినట్లు ఆయన తెలిపారు. కుల గణాంకాల ఆధారంగా ప్రజలకు లబ్ధి చేకూర్చే పథకాలను రూపొందించే వీలు ఉంటుందని తేజస్వి అన్నారు.