ఆంధ్రప్రదేశ్ ముఖ్యాంశాలు

ఉద్యోగుల స‌మ‌స్య పై ఆలోచనతో స్పందించాలి : చంద్ర‌బాబు

చలో విజయవాడలో ఉద్యోగుల నిరసనలపై జగన్ ప్రభుత్వ నియంతృత్వ తీరును ఖండిస్తున్న‌ట్టు టీడీపీ అధినేత చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగులను ఉగ్రవాదుల్లా అరెస్టులు చేస్తారా? అని ఆయ‌న మండిప‌డ్డారు. విశ్వసనీయతపై ఉద్యోగుల ప్రశ్నలకు సీఎం జగన్ సమాధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. వైసిపి ప్రభుత్వం రివర్స్ పిఆర్సిని వెనక్కి తీసుకోవాల‌ని, నియంతృత్వం వీడి పరిష్కారం చూపాలని సూచించారు. లక్షలాద‌ మంది సమస్యపై అహంకారంతో కాకుండా… ఆలోచనతో స్పందించాలన్నారు చంద్ర‌బాబు.

ప్రభుత్వం చేసిన మోసంపై నిరసన తెలిపే హక్కు ఉద్యోగులకు లేదా.. ఉద్యోగులు రాష్ట్ర ప్రజలు కాదా… రాష్ట్రంలో భాగస్వాములు కాదా? అని ప్ర‌శ్నించారు బాబు. రాజకీయ పక్షాలపై పెట్టినట్లు ఉద్యోగులపై గృహ‌ నిర్భంధాలు చేయ‌డం సిఎం జగన్ వైఖరిని స్పష్టం చేస్తున్నాయని దుయ్య‌బ‌ట్టారు. పోలీసు పహారా పెట్టి ఉపాధ్యాయులను నిర్భందించడం… విద్యార్థుల ముందు టీచర్లను అవమానించడమేన‌ని, మాయ మాటలతో ప్రజలను, ఉద్యోగులను మోసం చేసి అధికారంలోకి వచ్చిన జగన్… ఇప్పుడు అంకెల గారడీతో జీతాలు తగ్గించలేదని మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. ఉద్యోగుల‌ను అగౌర‌ప‌రిచే, ఆత్మ‌గౌర‌వం దెబ్బ‌తీసే విధానాన్ని జ‌గ‌న్ ఇప్ప‌టికైనా వీడాలన్నారు.

రాష్ట్రం ఏర్పడిన కొత్తలో, తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మేము 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చాము. జగన్ సర్కార్ లా… ఐఆర్ కంటే తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి జీతాలు రికవరీ చెయ్యడం దేశంలోనే ఇప్పటి వరకు జరగలేదని చంద్ర‌బాబు అన్నారు. ప్రభుత్వం భేషజాలు పక్కన పెట్టి.. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని హితవుపలికారు చంద్ర‌బాబు.