లాక్‌డౌన్‌లో గణనీయంగా తగ్గిన కరోనా పాజిటివిటీ రేటు
6.74 శాతం నుంచి 1.47 శాతానికి తగ్గుదల
ఆస్పత్రుల్లో 52 శాతం నుంచి 16 శాతానికి తగ్గిన ఆక్యుపెన్సీ
ప్రభుత్వానికి వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక
కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు సత్ఫలితాన్నిచ్చాయి. ప్రజలు మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఒకేచోట ఎక్కువ మంది గుమికూడకపోవడం వంటి జాగ్రత్తలు పాటించడంతో పాటు జనసంచారాన్ని కట్టడి చేస్తే వైరస్ తోక ముడుస్తుందని లాక్‌డౌన్ విధింపు తర్వాత నమోదైన కేసుల సరళి మరోసారి స్పష్టం చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని, రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. ఏప్రిల్‌లో మొదలైన కోవిడ్ తీవ్రత నెలాఖరుకు వచ్చేసరికి మరింత తీవ్రంగా మారింది. మే నెల మొదటి వారంలో రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు ఏకంగా 8.69 శాతం నమోదైంది.
ఈ క్రమంలో అదే నెల 12వ తేదీన ప్రభుత్వం తెలంగాణలో లాక్‌డౌన్ విధించింది. ఆ రోజు నుంచి ఈ నెల 13వ తేదీ వరకు లాక్‌డౌన్‌తో కట్టడి చర్యలు తీసుకోవడం వల్ల రాష్ట్రంలో కరోనా నియంత్రణలోకి వచ్చిందని వైద్య ఆరోగ్య శాఖ తాజాగా ప్రభుత్వానికి అందజేసిన నివేదికలో తెలిపింది. లాక్‌డౌన్ పెట్టిన మొదటి వారంలో కరోనా పాజిటివిటీ రేటు 6.74 శాతం నమోదు కాగా 29,778 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా గత వారంలో (ఈ నెల 9 నుంచి 13 వరకు) పాజిటివిటీ రేటు ఏకంగా 1.40 శాతానికి (8,369 కేసులు) పడిపోవడం గమనార్హం. అంటే ఐదు వారాల్లోనే దాదాపుగా ఐదో వంతు వరకు పడిపోయిందన్నమాట.
మూడున్నర నెలలు విజృంభణ..
రాష్ట్రంలో గతేడాది మార్చి 2వ తేదీ నుంచి కరోనా కేసులు ప్రారంభం కాగా మొదటి వేవ్ కంటే రెండో వేవ్‌లో వ్యాప్తి తీవ్రంగా ఉంది. వైద్య ఆరోగ్యశాఖ నివేదిక ప్రకారం.. ఈ నెల 13వ తేదీ వరకు మొత్తం 6.03 లక్షల కరోనా కేసుల నమోదు కాగా, అందులో సగం అంటే 3.04 లక్షల కేసులు సెకండ్ వేవ్‌లోనే నమోదు కావడం గమనార్హం. అంటే గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు సగం కేసులు నమోదైతే, గత మార్చి నెల నుంచి ఇప్పటివరకు అంటే మూడున్నర నెలల్లోనే మిగిలిన సగం నమోదయ్యాయన్న మాట. మొత్తం 1.67 కోట్ల నమూనాలను పరీక్షించగా, అందులో ఈ మూడు నెలల్లోనే సగం మేరకు అంటే 80.02 లక్షల నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు మొత్తంగా చూస్తే పాజిటివిటీ రేటు 3.60 శాతం ఉంటే, ఈ మూడున్నర నెలల సెకండ్ వేవ్‌లో 3.80 శాతంగా నమోదైంది.
ముమ్మరంగా ఫీవర్ సర్వే..
కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో ప్రభుత్వం గత నెల ఐదో తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్ సర్వే చేపట్టింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీ వరకు నాలుగు రౌండ్ల సర్వేలు నిర్వహించారు. మొదటి రౌండ్‌లో 20,134 బృందాలు 1.13 కోట్ల ఇళ్లల్లో సర్వే చేయగా, 2.36 లక్షల మందిలో జ్వరం, తలనొప్పి ఇతరత్రా లక్షణాలు కనిపించాయి. రెండో రౌండ్‌లో 15,703 బృందాలు 99 లక్షల ఇళ్లల్లో సర్వే చేసి 1.34 లక్షల మందిలో లక్షణాలు గుర్తించారు. ఇక మూడో రౌండ్‌లో 14,482 బృందాలు 55.79 లక్షల ఇళ్లల్లో సర్వే చేసి 65,292 మందిలో, నాలుగో రౌండ్‌లో 2,394 బృందాలు 6.02 లక్షల ఇళ్లల్లో 4,862 మందిలో లక్షణాలు గుర్తించారు. లక్షణాలున్నవారికి మెడికల్ కిట్లను అందజేశారు.
95.91 శాతానికి పెరిగిన రికవరీ రేటు
లాక్‌డౌన్ మొదలైన తొలి వారంలో రాష్ట్రంలో రికవరీ రేటు (కోలుకున్నవారు) 90.47% ఉం డగా, ఆ తర్వాత అది క్రమంగా పెరుగుతూ, గత వారంలో 95.91 శాతానికి చేరింది. అలాగే లాక్‌డౌన్ మొదటి వారంలో ఆసుపత్రుల్లో ఆక్యుపెన్సీ ఏకంగా 52 శాతం కాగా, గత వారంలో అది ఏకంగా 16 శాతానికి పడిపోయింది.