డిక్షనరీ శశిథరూర్ ట్వీట్ లో అక్షర దోషాలు.. కేంద్ర మంత్రి రుసరుసలు.
శశిథరూర్ ను ‘డిక్షనరీ’ అని పిలుస్తుంటారు. కొత్త కొత్త పదాలను పరిచయం చేస్తూ ఇంగ్లిష్ పై తనకున్న పట్టును ఆయన అందరికీ తెలియజేస్తుంటారు.. ఇంగ్లిష్ ను నేర్పుతుంటారు. అలాంటి డిక్షనరీనే తప్పులు చేస్తే! అవును, ఆయన కూడా తప్పు చేశారు. తాను చేసిన ట్వీట్ లో తప్పుగా టైప్ చేశారు. దానిపై కేంద్ర మంత్రి రుసరుసలాడారు.
సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టే ఓ ఫొటోను పోస్ట్ చేసిన థరూర్.. ప్రభుత్వంలోని మంత్రులే నమ్మడం లేదని పేర్కొంటూ ఆ ఫొటోలో నిర్మలవైపు అథవాలే షాకింగ్ చూస్తున్నారంటూ ఎత్తి చూపారు. ‘‘దాదాపు రెండు గంటల పాటు బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ పై అయోమయంతో షాక్ అయిన మంత్రి రాందాస్ అథవాలే మొహమే బడ్జెట్ ఎలా ఉందో చెబుతుంది. ఆర్థిక వ్యవస్థ, బడ్జెట్ పై నిర్మలా సీతారామన్ ప్రకటనలపై సభ మొదటి వరుసవాళ్లకే నమ్మకం లేదు’’ అని ట్వీట్ చేశారు.
అయితే, ‘REPLY’కి బదులు ‘RELY’ అని, ‘BUDGET’కి బదులు ‘BYDGET’ అని తప్పుగా టైప్ చేశారు. ఆ ట్వీట్ లో తన ప్రస్తావన రావడంతో అసహనం వ్యక్తం చేసిన మంత్రి రాందాస్ అథవాలే.. థరూర్ పై రుసరుసలాడారు. ముందు అక్షరదోషాలు సరిచేసుకోవాలంటూ సూచించారు. ‘‘అనవసరమైన ప్రకటనలు, వ్యాఖ్యలు చేసేవారు తప్పులు చేస్తుంటారని చెబుతుంటారు. మీరూ చేశారు శశిథరూర్ గారూ. అది BYDGET కాదు BUDGET.. RELY కాదు REPLY. అయినా మాకు అర్థమైంది లెండి’’ అంటూ ట్వీట్ చేశారు.
కాగా, శశిథరూర్ తప్పుగా టైప్ చేయడంపై నెటిజన్లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అసలు డిక్షనరీ కూడా ఇలాంటి తప్పులు చేస్తుందా? అని తెల్లమొహం వేస్తున్నారు. అయితే, ఆయన్ను తప్పుబట్టాల్సిన అవసరం లేదని, ఏదో జోక్ గా చేసి ఉంటారని అంటున్నారు. అయితే, అది తన పొరపాటు వల్లే జరిగిందని, ఒక అక్షరం టైప్ చేయబోయి తప్పు అక్షరం టైప్ చేశానని థరూర్ క్లారిటీ ఇచ్చారు.