జాతీయం ముఖ్యాంశాలు

ఖర్కీవ్, సుమీ ప్రాంతాల్లో ఇంకా 1,000 మంది భారతీయులు

కొంత సమయం పాటు కాల్పులు ఆపండి.. భారతీయులు అందరినీ తరలిస్తాం: భారత సర్కారు సంప్రదింపులు

ఉక్రెయిన్ నుంచి మెజారిటీ భారతీయులను ‘ఆపరేషన్ గంగ’ కార్యక్రమం కింద ఇప్పటికే స్వదేశానికి తీసుకురాగా, మిగిలిన కొద్ది మందిపైనా కేంద్ర సర్కారు దృష్టి సారించింది. రష్యా తన దాడులకు లక్ష్యంగా చేసుకున్న ఖర్కీవ్, సుమీ ప్రాంతాల్లో ఇంకా సుమారు 1,000 మంది వరకు భారతీయులు ఉంటారని అంచనా. అక్కడ దాడులు పెద్ద ఎత్తున కొనసాగుతుండడం సహాయక చర్యలకు అడ్డంకిగా మారింది.

దీంతో కొంత సమయం పాటు కాల్పులు విరమించేలా అటు రష్యా, ఇటు ఉక్రెయిన్ తో భారత సర్కారు సంప్రదింపులు చేస్తోంది. ఖర్కీవ్, సుమీ ప్రాంతాల్లో చిక్కుకున్న భారతీయులు కాల్పులకు లక్ష్యం కాకూడదన్నది సర్కారు ఉద్దేశ్యం. కొద్ది సమయం పాటు ఇరు పక్షాలు కాల్పులు ఆపివేస్తే.. అక్కడున్న భారతీయులను యుద్ధ ప్రాతిపదికన సరిహద్దు ప్రాంతాలకు తరలించి, అక్కడి నుంచి భారత్ కు తీసుకువచ్చేలా అధికారులు తమ ప్రయత్నాలు చేస్తున్నారు. శుక్రవారం నాటికి ఉక్రెయిన్ నుంచి 20,000 మందికి పైగా భారత్ కు తిరిగి వచ్చారు.

130 బస్సులు భారత విద్యార్థులను తీసుకుని రష్యాలోని బెల్గోరాడ్ కు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్టు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే ఈ బస్సులు విద్యార్థులున్న ప్రదేశానికి 50-60 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. అన్ని కిలోమీటర్లు దాటుకుని విద్యార్థులను చేరుకోవడం కష్టమని, ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నట్టు తెలిపింది. దీంతో కొంత సమయం పాటు కాల్పుల విరామానికి సంప్రదింపులు చేస్తున్నట్టు పేర్కొంది.