జాతీయం తెలంగాణ ముఖ్యాంశాలు

బీజేపీకి దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి: సీఎం కేసీఆర్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘించారని సీఎం కేసీఆర్‌ ధ్వజమెత్తారు. మోదీ అబద్ధాలు ఎక్కువగా చెబుతున్నారని, విద్యుత్‌ సంస్కరణలపైనా అబద్ధాలే చెబుతున్నారని మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మీటర్లు పెడుతున్న రాష్ట్రాలకు 0.5 శాతం ఎఫ్‌ఆర్‌బీఎం అదనంగా ఇస్తామంటున్నారని పేర్కొన్నారు. తెలంగాణలో విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయట్లేదని వచ్చే డబ్బులు కూడా ఆపేస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణకు 25 వేల కోట్ల నష్టం వస్తుందని తెలిసినా తను మీటర్లు పెట్టలేదని స్పష్టం చేశారు. విద్యుత్ సెక్టార్‌లో సవరణలు వెనక్కి తీసుకోవాలని గతంలో ప్రధానమంత్రికి లేఖలు రాసినట్లు పేర్కొన్న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీ తీర్మాణాన్ని కేంద్రానికి పంపినట్లు తెలిపారు.

‘మోదీ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు మీటర్లు పెట్టాల్సిందేనని ముసాయిదా బిల్లులో ప్రస్తావించారు. పార్లమెంటులో ఆమోదం పొందక ముందే బిల్లును అమలు చేస్తున్నారు. మోదీ వల్ల దేశం ఎంత నాశనమవుతోందో వివరిస్తూ ఎంతోమంది పుస్తకాలు రాస్తున్నారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడికి ఏమీ తెలీదు. మిషన్‌ భగీరథ ప్రారంభ సభలోనూ మోదీ అబద్ధాలే చెప్పారు. తెలంగాణకు యూనిట్‌ రూ. 1.10కే ఇస్తున్నట్లు మోదీ చెప్పారు. నా పక్కనే నిలబడి మోదీ అబద్ధం చెబుతున్నా మర్యాద కోసం నేను మాట్లాడలేకపోయాను. అసలు ఎప్పుడైనా తెలంగాణకు యూనిట్‌ రూ. 1.10కే విద్యుత్‌ ఇచ్చారా? మోదీ సమాధానం చెప్పాలి.
చదవండి: ఇండ్లు కట్టిస్తుండు.. పెండ్లి చేపిస్తుండు

‘ప్రధాని అయితే గోద్రా తరహా అల్లర్లు జరుగుతాయా? అని అడిగితే.. ముస్లింలకు మోదీ క్షమాపణ చెప్పాలి. క్షమాపణా రాజకీయాలు మోదీకి అలవాటే. వుద్ధున్న ప్రధాని ఎవరైనా వేరే దేశాల ఎన్నికల్లో జోక్యం చేసుకుంటారా? కర్ణాటకలో ఏం జరుగుతుందో చూడండి. మోదీ ప్రభుత్వ అవినీతిపై సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. ప్రజా కోర్టులోనూ తేల్చుకుంటాం. రఫెల్‌ కుంభకోణం బయటకు రావాలి. అందులో దొంగలు బయటపడాలి. రాహెల్‌పై రాహుల్‌ మాట్లాడితే ఆయనపై ఎదురుదాడి చేశారు. ఈడీ, సీబీఐ పెడతామని బెదిరిస్తున్నారు.

దేశ సంపదను దోచుకొని విదేశాలకు పారిపోయిన వాళ్లంగా మోదీ దోస్తులే.. ఇదా మీ దేశ భక్తి.. అందుకే అంటున్నా బీజేపీ మస్ట్‌గో. దమ్ముంటే నన్ను జైల్లో వేయాలి. జైలు అంటే దొంగలకు భయం. మాకేం భయం. ఎన్నికల్లో గెలవకపోయినా పరిపాలన చేసే సిగ్గులేని పార్టీ బీజేపీ. మహారాష్ట్రలో బీజేపీ పరువు పోలేదా. బీజీపీ పాలనలో దేశం మొత్తం నాశనమైంది. మోదీ పాలన అవినీతి కంపు.బీజేపీ అన్నీ అమ్మేస్తోంది. ఇప్పుడు విద్యుత్‌ అమ్మేడానికి సిద్ధమైంది. డిస్కమ్‌లను ప్రైవేటుపరం చేయాలనుకోవడం దారుణం. బడ్జెట్‌ కేసీఆర్‌కు అర్థం కాలేదని కిషన్‌ రెడ్డి అంటున్నారు. ఆయనకేం అర్థం అయ్యిందో నాకు అర్థం కాలేదు.