జాతీయం

దావూద్‌ సహచరుల స్థావరాలు, ఆస్తులపై ఎన్‌ఐఏ సోదాలు

ముంబయిలో 12 చోట్ల జరుగుతున్న సోదాలు

ఎన్ఐఏ అధికారులు ముంబయిలో పలు చోట్ల సోదాలు నిర్వహిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది, గ్యాంగ్‌స్టర్‌ దావూద్‌ ఇబ్రహీం సహచరుల స్థావరాలు, ఆస్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ దాడులు చేస్తున్నది. దావూద్‌ తరఫున హవాలా దందా నిర్వహిస్తున్నవారు, షార్ప్‌ షూటర్లు, డ్రగ్‌ ట్రాఫికర్లు, రియల్‌ ఎస్టేట్‌ మేనేజర్ల ఇండ్లు, స్థావరాలపై ఎన్‌ఐఏ అధికారులు సోమవారం తెల్లవారుజామున దాడిచేశారు. ముంబయిలోని బాంద్రా, నగ్‌పాడా, బొరివాలి, గోరేగావ్‌, పాలెల్‌, శాంతాక్రజ్‌ సహా మొత్తం 20 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.

దావూద్‌కు చెందిన డీ కంపెనీలోని అగ్రనాయకత్వం అండతోనే దేశంలో జరుగుతున్న నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్నాయని ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్‌ఐఏ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేసింది. ఈ నేపథ్యంలో దావూద్‌కు చెందిన స్థావరాలు, అనుచరులపై ఎన్‌ఐఏ దాడులు నిర్వహిస్తున్నది. దావూద్ అనుచరులపై సోదాలు నిర్వహిస్తోంది. దావూద్ అనుచరుల్లో పలువురు విదేశాల్లో ఉంటూ ఇక్కడ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు.

కాగా, 1993 నాటి ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నింధితులైన అండర్‌వరల్డ్‌ డాన్‌ దావూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా 2003లో అమెరికా ప్రకటించింది. ప్రస్తుతం అతడు పాకిస్థాన్‌లోని కరాచీ కేంద్రంగా అండర్‌ వరల్డ్‌ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.