ఉక్రెయిన్ పై రష్యా దాడి చేస్తున్న నేపథ్యంలో అక్కడ ఏపీకి చెందిన చాలా మంది విద్యార్థులు చిక్కుకున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కేంద్రానికి లేఖ రాశారు. వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రవాసాంధ్రుల సంక్షేమం, అభివృద్ధి, భద్రతే ధ్యేయంగా సీఎం జగన్ మార్గదర్శకత్వంలో ఆంధ్రప్రదేశ ప్రభుత్వ సంస్థ పనిచేస్తోంది. కొన్నిరోజులుగా ఉక్రెయిన్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉన్న నేపథ్యంలో భారతీయులు స్వదేశం రావాలని కేంద్రప్రభుత్వం పిలుపునిచ్చింది. ఎప్పటికప్పుడు పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. ఈ సందర్భంలో రాష్ట్ర సీఎం జగన్ కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి డా. జై శంకర్ కి లేఖ రాశారు. ఉక్రెయిన్ నుండి భారతదేశానికి చెందిన భారతీయులను స్వదేశానికి రప్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ అధికారులను అప్రమత్తం చేసింది.
మరోవైపు ఉక్రెయిన్ సంక్షోభం విషయంలో నాలుగు వారాలుగా ఏపీఎన్ఆర్టీ సొసైటీ పలు చర్యలు తీసుకుంది. ఉక్రెయిన్ లో ఉన్న తెలుగు వారి గురించి తెలుసుకునేందుకు ఉక్రెయిన్ లోని భారత రాయబార కార్యాలయానికి అధ్యక్షుడు వెంకట్ ఎస్. మేడపాటి జనవరి 30న ఇ మెయిల్ పంపారు. ఈ ఇ మెయిల్ లో అక్కడ నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు, ఉద్యోగుల జాబితా పంపమని, అలాగే భారతదేశానికి తిరిగి వెళ్లడానికి సుముఖంగా ఉన్న తెలుగు విద్యార్థులు, ఉద్యోగుల సమాచారాన్ని అందించమని అభ్యర్థించారు. ఉక్రెయిన్ నుండి స్వదేశానికి రావాలనుకునే ప్రవాసాంధ్రులకు సహాయం చేయడానికి అవసరమైన చర్యలు తీసుకుంది.