తెలంగాణ

రాజ‌న్న ఆల‌యానికి ఇస్తాన‌న్న రూ.100 కోట్లు ఏవి?

కేసీఆర్‌పై విజ‌య‌శాంతి ఫైర్‌

బీజేపీ నేత‌, మాజీ ఎంపీ విజ‌య‌శాంతి సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్ ఆగ‌డాల‌ను చూస్తూ ఆ శివుడు ఊరుకోడ‌ని, మూడో క‌న్ను తెరుస్తాడ‌ని, కేసీఆర్ సంగ‌తి తేలుస్తాడ‌ని ఆమె వ్యాఖ్యానించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన దీక్ష సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ రాజన్న ఆలయానికి ఏడాదికి రూ.100 కోట్ల చొప్పున ఇస్తా అన్నార‌ని.. ఆ లెక్క‌న ఆల‌య‌నికి రూ.700 కోట్లు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

అంత‌టితో ఆగ‌ని రాముల‌మ్మ‌.. కేసీఆర్ పై మ‌రింత ఘాటుగా విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ సంద‌ర్భంగా ఆమె ఏమ‌న్నారంటే.. “కేసీఆర్ కి గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకు సంస్కారం లేదు. దేవుడి విషయంలో అబద్ధం ఆడాడు. మీరు అని నేను ఆయ‌న‌ను ఆనను. కేసీఆర్‌ను నీవు అని పిలుస్తా. భక్తులకు ఇక్కడ ఏ సదుపాయాలు లేవు. గుడి చిన్నగా ఉంది. భక్తులు ఎక్కువగా వస్తున్నారు. చిన్న పిల్లలు, ముసలివాళ్లు ఇబ్బంది పడుతున్నారు. అభివృద్ధి చేయండి అంటే అరెస్ట్‌లు చేయడం ఆయన నైజం. వేములవాడ ఎమ్యెల్యేను గెలిపించారు. కానీ ఆయ‌న‌ ఏం చేశాడు? జిల్లా మంత్రి ఉన్నాడు ఏం లాభం. సీఎం దృష్టికి తీసుకెళ్లడం లేదు. ప్రపంచం మొత్తం మోదీని మెచ్చుకుంటున్నారు. కానీ, కేసీఆర్‌కి నచ్చడం లేదు. ఆ శివుడు ఊరుకోడు. మూడో కన్ను తెరుస్తాడు. కేసీఆర్‌ సంగతి తేలుస్తాడు” అని విజ‌య‌శాంతి త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.