జాతీయం

మణిపూర్ లో రెండో విడత ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

నేడు మణిపూర్ లో రెండో విడల పోలింగ్ జరుగుతోంది. ఈ రోజు ఉద‌యం 7 గంట‌లకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం వరకు కొనసాగనుంది. మొత్తం 22 అసెంబ్లీ స్థానాల‌కు 1,247 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. మణిపూర్‌లోని 10 జిల్లాల్లోని 22 నియోజకవర్గాకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రెండో దశలో పోలింగ్‌లో 8,47,400 మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. ఇందులో 4,18,401 మంది పురుషులు, 4,28,968 మంది మహిళలు, 31 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. వీరికోసం 1247 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ విడత‌లో మాజీ ముఖ్య‌మంత్రి ఓక్రం ఇబోబిసింగ్ తోపాటు ఆయ‌న కుమారుడు సూర‌జ్ కుమార్, పలువురు ప్ర‌ముఖులు పోటీలో ఉన్నారు. కాగా,మ‌ణిపూర్ లో ఫిబ్ర‌వ‌రి 28న తొలి దశ ఎన్నికలు జరిగాయి. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా పోలీసులు ప‌టిష్ట‌మైన భ‌ద్ర‌తను ఏర్పాటు చేశారు. మరోవైపు ఐదు రాష్ట్రాల్లో జ‌రుగుతున్న ఎన్నిక‌లు తుది ద‌శకు చేరుకున్నాయి. ఇప్ప‌టికే గోవా, పంజాబ్, ఉత్త‌ర ఖాండ్ రాష్ట్రాల్లో ఎన్నిక‌లు పూర్తి అయ్యాయి. ఇక, దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్త‌ర ప్ర‌దేశ్ లో 6 విడతల పోలింగ్ జరిగింది. ఈ నెల 7న చివరి విడత పోలింగ్ జ‌ర‌గ‌నుంది.