అంతర్జాతీయం ముఖ్యాంశాలు

అమెరికా సేనేట్‌లో ప్ర‌సంగం చేయ‌డానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం

అమెరికా సేనేట్‌లో ప్ర‌సంగం చేయ‌డానికి ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీకి ఆహ్వానం వ‌చ్చింది. జూమ్ ద్వారా జ‌రిగే స‌భా కార్యక్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతారు. అమెరికా అధ్య‌క్షుడు బైడెన్ ఇటీవ‌ల జెలెన్‌స్కీతో ట‌చ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై ర‌ష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మ‌ద్ద‌తు ఇస్తున్న విష‌యం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న స‌భ్యులంద‌రితో జెలెన్‌స్కీ మాట్లాడ‌నున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడ‌ర్ ఒక్‌సానా మ‌ర్క‌రోవా గ‌డిచిన వారం సేనేట్ స‌భ్యుల్ని క‌లిశారు. ఈ నేప‌థ్యంలో త‌మ దేశానికి అత్య‌ధిక స్థాయిలో స‌ర‌ఫ‌రాలు కావాల‌ని ఆమె వేడుకున్నారు. మ‌రో వైపు ఉక్రెయిన్‌, ర‌ష్యా మ‌ధ్య మూడో ద‌ఫా చ‌ర్చ‌లు జ‌ర‌గ‌నున్నాయి.

ఉక్రెయిన్‌కు, జెలెన్‌స్కీకి మ‌ద్ద‌తుగా యూరోప్‌లో భారీ ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుగుతున్నాయి. వేలాది మంది నిర‌స‌న‌కారుల‌ను ఉద్దేశించి జెలెన్‌స్కీ వీడియో సందేశం వినిపించారు. జార్జియా రాజ‌ధాని టిబ్లిసి, చెక్ రాజ‌ధాని ప్రాగ్‌లో జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌కు జెలెన్‌స్కీ వీడియోను ప్లే చేశారు. ఫ్రాంక్‌ఫ‌ర్ట్‌, విల్‌నియూస్‌, లియాన్‌, బ్రాటిస్‌లేవా న‌గ‌రాల్లో జ‌రిగిన ప్ర‌ద‌ర్శ‌న‌ల్లోనూ ఆయ‌న వీడియోను వినిపించారు. లిస్బ‌న్‌, లూసెర్న్‌, లండ‌న్‌, సియోల్‌, జ‌క‌ర్త‌, లా పాజ్ న‌గ‌రాల్లోనూ ఉక్రెయిన్‌కు మ‌ద్ద‌తుగా ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రిగాయి.