జాతీయం ముఖ్యాంశాలు

కేంద్రానికి భారీ రిలీఫ్.. ప‌న్ను వ‌సూళ్ల‌లో 100% గ్రోత్‌!

కొవిడ్‌- 19 మ‌హ‌మ్మారి వేళ ప్ర‌త్య‌క్ష ప‌న్నుల వ‌సూళ్ల‌లో ప్ర‌స్తుత ఆర్థిక సంవ‌త్స‌రం (2021-22) లో కేంద్ర ప్ర‌భుత్వానికి రిలీఫ్ ల‌భించింది. ఆదాయం ప‌న్ను వ‌సూళ్లు రూ.1.85 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకున్నాయ‌ని ఆదాయం ప‌న్ను శాఖ (ఐటీ) తెలిపింది. గ‌తేడాది ఇదే స‌మ‌యంలో రూ.92.762 కోట్లు వ‌సూలు అయ్యాయి. దీని ప్ర‌కారం ప‌న్ను వ‌సూళ్ల‌లో 100 శాతం గ్రోత్ న‌మోదైంది.

ఈ నెల 15వ తేదీ నాటికి ప్ర‌త్యక్ష ప‌న్ను వ‌సూళ్లు రూ.1,85,871 కోట్ల‌కు చేరాయి. నిక‌ర కార్పొరేట్ టాక్స్ క‌లెక్ష‌న్ రూ.74,356 కోట్లు కాగా, సెక్యూరిటీ ట్రాన్సాక్ష‌న్ టాక్స్‌తోపాటు వ్య‌క్తిగ‌త ఆదాయం ప‌న్ను రూ.1,11,043 కోట్లు అని ఐటీ శాఖ ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

ఈ ఏడాది తొలి త్రైమాసికంలో అడ్వాన్స్ టాక్స్ క‌లెక్ష‌న్లు రూ.28,780 కోట్లు జ‌రిగాయి. గ‌తేడాది ఇది రూ.11,714 కోట్ల‌కు ప‌రిమిత‌మైంది. దీని ప్ర‌కారం అడ్వాన్స్ టాక్స్ వ‌సూళ్ల‌లో సుమారు 146 శాతం గ్రోత్ రికార్డైంది. ప‌న్ను చెల్లింపుదారుల‌కు కేంద్రం ఈ ఆర్థిక సంవ‌త్స‌రంలో రూ.30,731 కోట్లు రీఫండ్ చేసింది.

మొత్తం స్థూల ప‌న్ను వ‌సూళ్లు రూ.2.16 ల‌క్ష‌ల కోట్లు దాటాయి. గ‌తేడాది కేవ‌లం రూ.1.37 ల‌క్ష‌ల కోట్లు మాత్ర‌మే వ‌సూల‌య్యాయి. అయితే, వీటిలో రూ.30,731 కోట్లు రీఫండ్ చేయ‌డంతో నిక‌ర ప‌న్ను వ‌సూళ్లు రూ.1.85 ల‌క్ష‌ల కోట్లు అని కేంద్ర ప్ర‌త్య‌క్ష ప‌న్నుల బోర్డు (సీబీడీడీ) తెలిపింది.