రాష్ట్రంలోని గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ‘పల్లెప్రగతి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. ‘పల్లె ప్రగతి’ కార్యక్రమం ద్వారా గ్రామాలన్నీ పచ్చదనంతో పరిఢవిల్లాలన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం మంచుకొండ గ్రామంలో మంత్రి అజయ్‌కుమార్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. గ్రామానికి చెందిన ఎస్సీ, బీసీ కాలనీ పురవీధుల గుండా పర్యటించి సమస్యలపై ఆరా తీశారు.
ఈ సందర్భంగా రోడ్ల వెంట నిర్లక్ష్యంగా పడేసిన చెత్త కుప్పలు, రాళ్లకుప్పలను చూసి అధికారులు, ప్రజాప్రతినిధులపై మండిపడ్డారు. గ్రామ కార్యదర్శి రాంకీ నిర్లక్ష్యపు సమాధానం చెబుతుండడంతో వెంటనే సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా మంత్రి డీపీవో ప్రభాకర్‌రావును ఆదేశించారు. గ్రామాలాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంటే గ్రామస్థాయిలో అధికారులు నిర్లక్ష్యం వహించడం తగదని హెచ్చరించారు.