సీఎం కెసిఆర్ తెలంగాణలో ధాన్యాన్ని కొనుగోలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. యాసంగిలో పండిన మొత్తం ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ఆ లేఖలో డిమాండ్ చేశారు. పంజాబ్, హర్యానాలో మాదిరిగానే తెలంగాణలో కూడా ధాన్యాన్ని సేకరించాలని కేసీఆర్ పేర్కొన్నారు. ఆహార భద్రతా చట్టాన్ని అమలు చేసే బాధ్యత కేంద్రానిదే అని సీఎం స్పష్టం చేశారు. ఆహార భద్రతా చట్టం ప్రకారం ఆహార ధాన్యాల సేకరణ, వాటి భద్రత కూడా కేంద్రానిదే అని సీఎం కేసీఆర్ కేంద్రానికి ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ నిపుణులతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఈ లేఖలో కోరారు. రైతు పండించిన మొత్తం ధాన్యాన్ని సేకరించకపోతే, కనీస మద్దతు ధరకు ఏం అర్థముంటుందని కేసీఆర్ సూటిగా ప్రశ్నించారు.
ఆహార భద్రతా లక్ష్యానికి కూడా తూట్లు పొడిచినట్లే అవుతుందని సీఎం తేల్చి చెప్పారు. దేశ మంతా ఒకే రకమైన ధాన్య సేకరణ విధానం ఉండాలని, కేంద్ర ప్రభుత్వం పండిన ధాన్యాన్ని గనక పూర్తిగా సేకరించకపోతే సాగు రంగంపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని కేసీఆర్ హెచ్చరించారు. అయితే.. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న పటిష్ఠమైన చర్యల వల్ల రాష్ట్రంలో ధాన్యం దిగుబడి బాగా పెరిగిందని, వ్యవసాయం సుస్థిరపడిందన్నారు. పంటల వైవిధ్యత కోసమే తమ ప్రభుత్వం ఇతర పంటలను కూడా ప్రోత్సహిస్తోందని కేసీఆర్ కేంద్రానికి క్లారిటీ ఇచ్చారు. రబీ సీజన్‌లో 52 లక్షల ఎకరాల్లో వరి పంటను సాగు చేయించామని, ఎలాంటి ఆంక్షలు లేకుండా వరిని కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీని డిమాండ్ చేశారు.