తెలంగాణ ముఖ్యాంశాలు

బెంబేలెత్తిస్తున్న ఎండలు

అత్యధికంగా 43 డిగ్రీలు, ఆరెంజ్ అలర్ట్, మరో నాల్గు రోజులు జాగ్రత్త

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకీ ఎండలు మండిపోతున్నాయి. భానుడి ప్రతాపానికి ప్రజలు అల్లాడిపోతున్నారు. ఉదయం 9 గంటల నుంచి ఎండలు మండిపోతుండటంతో ప్రజలంతా తమ పనులను ఉదయం లేదా సాయంత్రం చేసుకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎండలతోపాటు వడగాలులు కూడా ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల్లో మరింతగా ఎండలు తీవ్రమవుతాయని వాతావరణ శాఖ చెబుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు.

తెలంగాణలో మరో నాలుగు రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు

రానున్న నాలుగు రోజుల పాటు సాధారణ ఉష్ణోగ్రతల కంటే అధికంగా ఎండల తీవ్రత ఉండనుందని.. అదనంగా 4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మార్చి నెలలో ఎన్నడూ లేనంతగా భానుడు భగభగమంటున్నాడు. కుమరం భీం జిల్లాలోని కెరమెరి గ్రామంలో అత్యధిక ఉష్ణోగ్రత 43.9 డిగ్రీలు నమోదైంది. గత పదేళ్లలో మార్చి నెలలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత రికార్డని తెలుస్తోంది. ఇక ఏప్రిల్ నెలలో ఈ ఆరెంజ్ అలెర్ట్‌ను జారీ చేసింది వాతావరణ శాఖ.

ప్రభుత్వం ముందస్తు చర్యలు, శాఖలకు ఆదేశాలు

ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని హెచ్చరికల నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టింది. తెలంగాణా సీఎస్ సోమేశ్ కుమార్.. అన్ని జిల్లా కలెక్టర్లతో సమీక్ష నిర్వహించారు. అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బందిని అప్రమత్తం చేయాలనీ, సరిపడా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సీఎస్ సోమేశ్ కుమార్ సూచించారు. వేసవి తాపం, వడగాల్పుల వలన ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని స్కూల్స్‌లో పని సమయాన్ని తగ్గిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు. ఇక ఉపాధి కూలీలు ఎండకాస్తున్న సమయంలో పనులు చేయకుండా తగిన చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. అంతేగాక, అగ్నిమాపక శాఖ కూడా అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు