ఏపీలో ‘పవర్ హాలిడే’ ఫై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఎడాపెడా కరెంట్ కోతలతో జనం అల్లాడుతున్నారు. పగలూ లేదు.. రాత్రీ లేదు.. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ కట్ చేస్తున్నారు. ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు దోమల మోతతో రాష్ట్ర ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇక ఇదే అనుకుంటే నిన్నటి నుండి పరిశ్రమలకు సైతం ‘పవర్ హాలిడే’ ఇచ్చారు. దీంతో పరిశ్రమలు భారీ నష్టాలు చవిచూస్తున్నాయి. గతంలో 2014 అక్టోబరు వరకు మాత్రమే రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉండేవి. తర్వాత మళ్లీ ఇప్పుడే కోతలు మొదలయ్యాయి. ఏపీలో విద్యుత్ ఉత్పత్తి మిగిలిన రాష్ట్రాల కంటే ఎక్కువగానే ఉన్నా.. కావల్సిన వనరులున్నా.. ముందస్తు ప్రణాళిక లేకుండా వ్యవహరించడమే ప్రస్తుత సమస్యకు కారణమన్నట్లు తెలుస్తుంది. ఇక రాష్ట్రంలో కరెంట్ కోతలపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ , బిజెపి పార్టీ లతో పాటు జనసేన పార్టీ సైతం తీవ్ర విమర్శలు చేస్తుంది.
రాష్ట్ర విభజన సమయంలో మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో 2014– 19 మధ్య కూడా కోతల ప్రభావం లేదన్నారు. వైకాపా అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఒప్పందాలు రద్దుచేసి, గతానికంటే ఎక్కువ ధరలకు విద్యుత్ కొనడం ఏంటని ప్రశ్నించారు. ‘పవర్ హాలిడే’ అనేది పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమన్నారు. దీని వల్ల 36లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి పడుతుందని పవన్ కల్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామన్న వైకాపా.. ఇప్పుడు 57 శాతం ఛార్జీల మోత మోగించడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలపై మాట్లాడితే తనను వ్యక్తిగతంగా దూషిస్తున్నారన్న పవన్.. నోటికి వచ్చినట్లు మాట్లాడి తన సహనాన్ని పరీక్షించొద్దని హెచ్చరించారు. పవర్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు జగన్ సర్కార్ ఎలా మోసం చేస్తుందో.. ప్రజల్లోకి తీసుకెళ్లాలని జన సైనికులు, వీరమహిళలకు పిలుపునిచ్చారు.