ఫ్రాన్స్‌లోని ఆల్ఫ్స్ పర్వత శిఖరాల నుంచి ప్రవహించే హిమనీనదాల్లో ఇటీవల చిక్కని రక్తవర్ణపు చారలు జాలువారడం అక్కడి ప్రజలను, పరిశోధకులను షాక్‌కి గురిచేసింది. దీనిపై అధ్యయనం చేసిన శాస్త్రవేత్తల బృందం దాన్ని హిమనీనదం రక్తంగా పేరుపెట్టారు. వాతావరణ మార్పులను అర్థం చేసుకోవడంతో ఇది కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రస్తుతం భూమి, వాతావరణం ప్రతిరోజూ సరికొత్త సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో హిమనీనదం ప్రవాహంలో రక్తవర్ణపు చారలు ఎలా వచ్చాయా అనేదానిపై శాస్త్రవేత్తలు పరిశోధన ప్రారంభించారు.
మంచుతో కప్పబడి ఉండే ఆల్ఫ్స్ పర్వతాల శిఖర భాగంలో పెరుగుతున్న ఒక రకమైన మైక్రో ఆల్గే వల్లే ఈ రక్తవర్ణపు చారలు ఏర్పడుతున్నాయని నిర్ధారించారు. ఈ మైక్రో ఆల్గే సాధారణంగా సముద్ర గర్భంలో పెరుగుతుంది. అలాంటిది సముద్ర మట్టానికి వేల అడుగుల ఎత్తులో ఉండే ఆల్ఫ్స్ పర్వత శిఖరాల్లో ఇది ఎలా నిక్షిప్తమయింది? అది ఎరుపు రంగులోకి ఎలా మారింది? అనేది శాస్త్రవేత్తలకు అంతుచిక్కడంలేదు. రానున్న రోజుల్లో వాతావరణంలో పెనుమార్పులకు ఇది సంకేతమని శాస్త్రవేత్తలు ఆందోళన చెందుతున్నారు.