అంతర్జాతీయం జాతీయం ముఖ్యాంశాలు

భారత్‌లో గణనీయంగా పేదరికం తగ్గుముఖం: ప్రపంచ బ్యాంకు

పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్‌ను విడుదల చేసిన ప్రపంచబ్యాంకు
ఇటీవల ఇదే విషయమై భారత్‌ను ప్రశంసించిన ఐఎంఎఫ్

భారత్‌లో పేదరికం గణనీయంగా తగ్గింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో పేదరికం బాగా తగ్గుముఖం పడుతున్నట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది. భారత్‌లో పేదరికానికి సంబంధించి ప్రపంచబ్యాంకు పాలసీ రీసెర్చ్ వర్కింగ్ పేపర్‌ను విడుదల చేసింది. దీని ప్రకారం.. 2011-19 మధ్య కాలంలో దేశంలో తీవ్రమైన పేదరికం 12.3 శాతం తగ్గింది. 2011లో 22.5 శాతంగా ఉన్న పేదరికం 2019కి 10.2 శాతం తగ్గింది. అలాగే, భారత్‌లో పేదరికానికి సంబంధించి అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఇటీవల ఓ వర్కింగ్ పేపర్‌ను విడుదల చేస్తూ.. భారత్ తీవ్రమైన పేదరికాన్ని నిర్మూలించిందని కొనియాడింది. ఆహార ధాన్యాలను ఉచితంగా అందజేయడం ద్వారా వినియోగంలో అసమానతలను 40 ఏళ్లలో కనిష్ఠ స్థాయికి తెచ్చినట్టు ప్రశంసించింది.

ఇప్పుడు ప్రపంచబ్యాంకు కూడా ఇదే విషయాన్ని పేర్కొంది. 2011లో గ్రామాల్లో 26.3 శాతంగా ఉన్న పేదరికం 2019లో 11.6 శాతానికి తగ్గినట్టు వివరించింది. అదే సమయంలో పట్టణాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది. అంటే ఈ కాలంలో పేదరికం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 14.7 శాతం, 7.9 శాతం మేర తగ్గింది. చిన్నకమతాల రైతుల వాస్తవ ఆదాయం 2013-2019 మధ్య కాలంలో ఏటా 10 శాతం పెరిగిందని, ఎక్కువ విస్తీర్ణం ఉన్న రైతుల ఆదాయం అదే సమయంలో 2 శాతం మాత్రమే వృద్ధి చెందినట్టు ప్రపంచబ్యాంకు తెలిపింది.