వారంలోపు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ
లఖింపూర్ ఖేరీ కేసులో అశిష్ మిశ్రా బెయిల్ ని సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోపు లొంగిపోవాలని ఆశిష్ మిశ్రాకు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గత ఏడాది అక్టోబర్ 3వ తేదీన ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీలో రైతుల్ని హత్య చేసిన కేసులో ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని రైతు బాధిత కుటుంబాలు సుప్రీంను ఆశ్రయించాయి. ఈ నేపథ్యంలో ఇవాళ సీజేఐ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును వెలువరించింది.
అసంబద్ధ కారణాలతో హైకోర్టు బెయిల్ ఇచ్చిందని, అవసరమైన అంశాలను కోర్టు పట్టించుకోలేదని ఇవాళ సుప్రీం తన తీర్పులో పేర్కొన్నది. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలను రద్దు చేసిన సుప్రీం.. వారం రోజుల్లోగా ఆశిష్ మిశ్రా సరెండర్ కావాలని ఆదేశించింది. ఈ కేసులో మళ్లీ విచారణ చేపట్టాలని అలహాబాద్ హైకోర్టును సుప్రీం కోరింది. బాధిత కుటుంబాల అభిప్రాయాల్ని హైకోర్టు సరిగా వినలేదని జస్టిస్ సూర్యకాంత్ తెలిపారు. సుప్రీం బెంచ్‌లో జస్టిస్ హిమా కోహ్లీ కూడా ఉన్నారు. కాగా, ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్ మిశ్రాకు చెందిన కారు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.