ఆంధ్రప్రదేశ్ జాతీయం

రూ.2 లక్షల కోట్లతో పెట్రో కారిడార్‌

సీఎం జగన్‌ ఢిల్లీ పర్యటన అనంతరం కేంద్రంలో కదలిక

రాష్ట్రంలో తొలి పెట్రో కాంప్లెక్స్‌ 

విభజన చట్టం హామీ అమలుకు వర్కింగ్‌ గ్రూపు ఏర్పాటు 

మారిన చట్టాలు, తగ్గిన వడ్డీ రేట్లను బట్టి కొత్తగా ప్రాజెక్టు రిపోర్టు

ఇంజనీర్స్‌ ఇండియా, ఎస్‌బీఐ క్యాప్‌కి బాధ్యతలు

సీఎం సూచనలతో కేంద్రానికి పూర్తిస్థాయి ప్రజెంటేషన్‌ 

కేంద్ర మంత్రి ధర్మేంద్రతో ఢిల్లీలో మంత్రి మేకపాటి సమావేశం

రూ.1,000 కోట్లతో ఏపీలో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటుకు హామీ

రాష్ట్రంలో గ్రీన్‌ఫీల్డ్‌ పెట్రోలియం రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు దిశగా కీలక ముందడుగు పడింది. పెట్రో కారిడార్‌ ద్వారా రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులతో పాటు రాష్ట్రంలో 50 లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్‌ 93(4) ప్రకారం ఏపీలో రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటు ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్రం వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు. విభజన చట్టం హామీ ప్రకారం సుమారు రూ.25 – 30 వేల కోట్లతో యాంకర్‌ ఇన్వెస్ట్‌మెంట్‌గా రిఫైనరీ ఏర్పాటుకు కేంద్రం సానుకూలత వ్యక్తం చేసిందని తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువు సంయుక్త కార్యదర్శి చైర్మన్‌గా కేంద్ర, రాష్ట్ర అధికారులతో వర్కింగ్‌ గ్రూపును ఏర్పాటు చేసినట్లు వివరించారు. బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి తరుణ్‌ కపూర్‌లను కలసి రాష్ట్ర ప్రతిపాదనలు వివరించిన అనంతరం మంత్రి మేకపాటి విలేకరులతో మాట్లాడారు.

సీఎం ఢిల్లీ పర్యటన అనంతరం వేగవంతం..
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల ఢిల్లీ పర్యటన అనంతరం పెట్రో కెమికల్‌ కారిడార్‌పై కేంద్రం వేగంగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి మేకపాటి తెలిపారు. తగ్గిన కార్పొరేట్‌ ట్యాక్స్, వడ్డీరేట్లను పరిగణలోకి తీసుకుంటూ కొత్త ప్రాజెక్టు రిపోర్టు తయారు చేసే బాధ్యతను ఇంజనీర్స్‌ ఇండియా లిమిటెడ్, ఎస్‌బీఐ క్యాప్‌లకు అప్పగించినట్లు చెప్పారు. యాంకర్‌ యూనిట్‌ రాకతో కాకినాడ వద్ద ఏర్పాటయ్యే పెట్రోలియం, కెమికల్స్‌ అండ్‌ పెట్రో కెమికల్స్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ రీజియన్‌ (పీసీపీఐఆర్‌) రూ.రెండు లక్షల కోట్లకు పైగా పెట్టుబడులను ఆకర్షిస్తుందని, 50 లక్షల మందికిపైగా ఉపాధి లభిస్తుందని వివరించారు. 

ఇథనాల్‌ తయారీ యూనిట్‌పై సానుకూలం
దీంతో పాటు రాష్ట్రంలో ఇథనాల్‌ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి కేంద్రం ఆసక్తిని వ్యక్తం చేసినట్లు మంత్రి మేకపాటి వెల్లడించారు. చక్కెర కర్మాగారాల ద్వారా వచ్చే మొలాసిస్‌ను ఇథనాల్‌గా మార్చడానికి ప్రత్యేకంగా రూ.1,000 కోట్లతో గ్రీన్‌ ఫీల్డ్‌ రిఫైనరీకి కూడా కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. పెట్రోల్‌లో ఇథనాల్‌ వినియోగాన్ని 10 నుంచి 20 శాతానికి కేంద్రం పెంచిన నేపథ్యంలో ఇథనాల్‌ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని తెలిపారు.

‘వీజీఎఫ్‌’ లేకుండా ప్రాజెక్టు!
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 10వతేదీన ఢిల్లీ పర్యటన సందర్భంగా పెట్రోలియం, ఉక్కు, సహజ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను కలసి విభజన చట్టం ప్రకారం కాకినాడ వద్ద రిఫైనరీ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరిన సంగతి తెలిసిందే. గతంలో రూపొందించిన ప్రాజెక్టు రిపోర్టు ప్రకారం వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ను రాష్ట్రం భరించాల్సి వచ్చేదని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 25 శాతం తగ్గించడం, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు దిగిరావడంతో ‘వీజీఎఫ్‌’ అవసరం లేకుండా ప్రాజెక్టును చేపట్టవచ్చని సూచించారు. దీనిపై రాష్ట్ర ప్రతిపాదనలను వినాల్సిందిగా కోరారు. 

రెండు రోజుల్లోనే కేంద్రం పిలుపు..
రాష్ట్రంలో ఒక మిలియన్‌ టన్నుల సామర్థ్యంతో రిఫైనరీ యూనిట్‌ ఏర్పాటుకు రూ.32,900 కోట్లు అవసరమని గతంలో హెచ్‌పీసీఎల్‌ – గెయిల్‌ అంచనా వేశాయి. దీనికి వయబులిటీ గ్యాప్‌ ఫండ్‌ కింద రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.975 కోట్ల చొప్పున 15 ఏళ్ల పాటు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాయి. అయితే దేశాన్ని 2024 నాటికి ఐదు ట్రిలియన్‌ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలనే ప్రధాని కలలు సాకారమయ్యేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని ఢిల్లీ పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ వివరించారు. ఈ నేపథ్యంలో సీఎం పర్యటన అనంతరం రెండు రోజుల్లోనే ప్రతిపాదనలతో రావాలంటూ కేంద్ర పెట్రోలియం శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి పిలుపు వచ్చింది. ఈ క్రమంలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్, పరిశ్రమలు – పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌లతో కూడిన ఉన్నతాధికారుల బృందం ఢిల్లీ చేరుకుని రాష్ట్ర ప్రతిపాదనలను వివరించారు. దీనిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం కీలకమైన ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లేలా ఒక బృందాన్ని ఏర్పాటు చేసింది.

సంపూర్ణ సహకారం అందిస్తాం: ధర్మేంద్ర ప్రధాన్‌
ఏపీలో పెట్రో కారిడార్‌ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ట్వీట్‌ చేశారు. మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డితో సంతృప్తికరంగా సమావేశం జరిగిందని, రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు, ఉపాధి కల్పనకు కీలకమైన పెట్రోలియం, సహజ వాయువు రంగాల అభివృద్ధికి సంబంధించి సమగ్రంగా చర్చించామంటూ ట్వీట్‌ చేశారు.