తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కి పూర్వ వైభవం తెచ్చేందుకు నేతలంతా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం సైతం తెలంగాణ ఫై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. వరుసగా నేతలతో రాహుల్ గాంధీ సమావేశమై ..కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ తరుణంలో మే 6, 7 తేదీల్లో ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 6న సాయంత్రం 4 గంటలకు వరంగల్‌లోని ఆర్ట్స్ కాలేజీలో జరిగే రైతు సంఘర్షణ సభకు ఆయన చీఫ్ గెస్ట్‌గా హాజవ్వనున్నారు. మే 7న రాహుల్‌గాంధీ హైదరాబాద్‌లో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బోయిన్‌పల్లిలో పార్టీకి చెందిన పదిన్నర ఎకరాల్లో రాజీవ్ గాంధీ నాలెడ్జ్ సెంటర్ నిర్మాణానికి రాహుల్‌తో భూమి పూజ చేయించనున్నారు.
అలాగే అక్కడే తెలంగాణ అమర వీరులు, ఆత్మహత్య చేసుకున్న రైతులు, నిరుద్యోగుల కుటుంబాలతో రాహుల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. కాగా వరంగల్ సభ ను భారీ సక్సెస్ చేసేందుకు నేతలు సన్నాహాలు చేస్తున్నారు. సభ కు ఐదు లక్షల మందిని తీసుకరావాలని చూస్తున్నారు. దీనికి తగ్గట్లే జిల్లాలకు సంబదించిన ఇంచార్జ్ లను నియమించారు.
ఈ సభను విజయవంతం చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కోరారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయాలి.. కాంగ్రెస్ సిద్దాంతాలు నమ్మే వాళ్ళందరూ రావాలని కోరుతున్నామని ఆయన అన్నారు. రైతులు.. రైతు కూలీలు అంతా రాహుల్ సభకి రండి అని, వ్యవసాయంపై కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది సభలో చెప్తామన్నారు. మేము ఇచ్చిన సబ్సిడీలు అన్ని బంద్ అయ్యాయి. రుణమాఫీ భారం లక్ష నుంచి నాలుగు లక్షలు అయ్యిందని ఆయన మండిపడ్డారు. మేము పంచిన భూములు.. ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, రైతులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడని ఆయన అన్నారు.