రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు ఇస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈరోజు సాయంత్రం 6:10 గంటలకు ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు ఇస్తున్నారు. ఇఫ్తార్ విందుకు ముస్లిం మత పెద్దలు, ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వాధికారులు హాజరుకాబోతున్నారు. జమాతుల్ విదాగా పిలిచే రంజాన్ మాసంలో ఆఖరి శుక్రవారం కావడంతో పాతబస్తీలోని మక్కా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు జరగనున్నాయి. ఈ రెండు కార్యక్రమాల నేపథ్యంలో నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు ఉంటాయని ట్రాఫిక్ విభాగ అధిపతి ఏవీ రంగనాథ్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఉత్తర్వులు జారీచేశారు. వాహనదారులు వీటిని దృష్టిలో పెట్టుకుని పోలీసులను సహకరించాలని కోరారు. సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు అమల్లో ఉంటాయని చెప్పారు. దీంతో నిర్దేశించిన సమయంలో వాహనదారులు ఏఆర్ పెట్రోల్ బంక్ నుంచి బీజేఆర్ విగ్రహం, అక్కడి నుంచి బషీర్‌బాగ్ ఇరువైపుల వెళ్లకుండా, ప్రత్యామ్నాయ రూట్లలో ప్రయాణించాలని సూచించారు.
ఎల్బీ స్టేడియం పరిసరాల్లో..
చాపల్ రోడ్డు, నాంపల్లి వైపు నుంచి వచ్చే వాహనాలకు బీజేఆర్ విగ్రహం వైపు అనుమతి ఉండదు. ఈ మార్గంలో వచ్చేవి ఏఆర్ పెట్రోల్ బంక్ వద్ద పీసీఆర్ వైపు మళ్లిస్తారు.
ఎస్‌బీఐ గన్‌ఫౌండ్రి వైపు నుంచి ప్రెస్‌క్లబ్, బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ వైపు వాహనాలను అనుమతి ఉండదు. ఎస్‌బీఐ వద్ద చాపల్‌రోడ్డులోకి మళ్లిస్తారు.
రవీంద్రభారతి, హిల్‌పోర్టు నుంచి బీజేఆర్ విగ్రహం వైపు కాకుండా.. కేఆర్‌కే బిల్డింగ్ వద్ద సుజాత హైస్కూల్ రూట్‌లోకి పంపిస్తారు.
నారాయణగూడ సిమెట్రీ వైపు నుంచి బషీర్‌బాగ్ వచ్చే వాహనాలను ఓల్డ్‌ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద హిమాయత్‌నగర్ వై జంక్షన్ వైపు మళ్లిస్తారు.
కింగ్‌కోఠి, బొగ్గులకుంట నుంచి బషీర్‌బాగ్ వైపు భారతీయ విద్యా భవన్ మీదుగా వచ్చేవి కింగ్‌కోఠి ఎక్స్ రోడ్స్‌లో తాజ్‌మహల్, ఈడెన్ గార్డెన్ వైపు పంపిస్తారు.
బషీర్‌బాగ్ నుంచి పీసీఆర్ వైపునకు వాహనాల అనుమతి ఉండదు. ఈ వాహనాలను లిబర్టీ వైపు మళ్లిస్తారు.
పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు :
శుక్రవారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు చార్మినార్-మదీనా, చార్మినార్-ముర్గీ చౌక్, రాజేష్ మెడికల్ హాల్-శాలిబండ మధ్య వాహనాలను అనుమతించరు. వీటిని మదీనా జంక్షన్, హిమ్మత్‌పుర, చౌక్ మైదాన్ ఖాన్, మోతీగల్లీ, ఈదీ బజార్ చౌక్, షేర్ బాటిల్ కమాన్, ఓల్డ్ కమిషనర్ కార్యాలయం చౌరస్తా వైపు మళ్లిస్తారు. ప్రార్థనలకు హాజరయ్యే వారి కోసం గుల్జార్ ఫంక్షన్ హాల్, ముఫీదుల్ అమాన్ గ్రౌండ్స్, చార్మినార్ బస్ టెర్మినల్, ఆయుర్వేదిక్ యునానీ హాస్పిటల్, ఖిల్వత్ గ్రౌండ్స్, చౌమొహల్లా ప్యాలెస్ ఎదురుగా ఉన్న ఓల్డ్ పెన్షన్ ఆఫీస్, సర్దార్ మహల్‌ల్లో పార్కింగ్ సదుపాయం కల్పించారు. సికింద్రాబాద్ మహంకాళి పోలీస్‌షన్ నుంచి రామ్‌గోపాల్ పేట్ రోడ్ జంక్షన్ మధ్య మార్గాన్ని ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు మూసేస్తారు. బాటా చౌరస్తా నుంచి సుభాష్ రోడ్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను లాలా టెంపుల్ మీదుగా మళ్లించనున్నారు.